ఏపీ కొత్త రాజధాని విజయవాడ

2

భగ్గుమన్న రాయలసీమ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా విజయవాడ ఎంపికైంది. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధానిపై కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు గురువారం తెరపడింది. కొత్త క్యాపిటల్‌ సిటీ ఎక్కడ కొలువుతీరనుందనే సందిగ్ధత తొలగిపోయింది. కనకదుర్గమ్మ కొలువుదీరిన బెజవాడే రాజధాని కేంద్రం కానుంది.  అయితే ఈ నిర్ణయంపై రాయలసీమ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. జయవాడ చుట్టుపక్కల ప్రాంతాలను రాజధానిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే, రాష్ట్రంలోని 13జిల్లాల్లో ఏర్పాటుచేయనున్న వివిధ ప్రాజెక్టులు, విద్యాసంస్థలను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం శాసనసభలో విధాన ప్రకటన చేశారు. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఉండాలని సెప్టెంబర్‌ 1న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. భూసేకరణ విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం వేసినట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో సమగ్రాభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. అయితే, రాజధానిపై ప్రకటనకు ముందే చర్చ చేయాలని వైఎస్సార్‌సీపీ పట్టుబట్టడంతో చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు. అభివృద్ధికి ప్రతిపక్షం సహకరించడంలేదని, ప్రతిపక్షం వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రాజధానిపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం.. చర్చ చేయండి, విూకేం కావాలో చెప్పండని ప్రతిపక్షానికి సూచించారు. అయినా విపక్షం సహకరించకపోవడంతో రాజధానిపై అసెంబ్లీలో 20 పేజీల ప్రకటన విడుదల చేశారు. జిల్లాల వారీగా ఏం చేయబోతున్నారో అందులో స్పష్టం చేశారు.

అభివృద్ధి వికేంద్రీకరణ

భూ సవిూకరణ ద్వారా రాజధానిని నిర్మించాలని భావిస్తున్నామని తెలిపారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక అన్ని జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరించిందన్నారు. కమిటీ నివేదిక ప్రజాభిప్రాయాన్ని బలపరించిందన్నారు. రాష్ట్ర ప్రగతి సాధన, ప్రజల సంక్షేమం కోసమే విజయవాడను రాజధానిగా ఎంపిక చేశామని తెలిపారు. అలాగే అన్ని జిల్లాలకు అభివృద్దిని విస్తరిస్తామన్నారు. ప్రతి జిల్లాలకో ఫుడ్‌పార్క్‌ ఏర్పాటుచేస్తామన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలను మెగాసిటీలుగా మారుస్తామని తెలిపారు. అలాగే 14స్మార్ట్‌సిటీల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఒక్కో సంవత్సరం ఒక్కో జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్నారు. అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్‌ అంతటా వికేంద్రీకరిస్తామని చెప్పారు.

ఐదు గ్రిడ్లు, ఏడు మిషన్లు

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఐదు గ్రిడ్లు, ఏడు మిషన్లు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. వాటర్‌, పవర్‌, గ్యాస్‌, రోడ్‌, బ్రాండ్‌బ్యాండ్‌లకు ప్రత్యేకంగా గ్రిడ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. విజయవాడ, తిరుపతి, విశాఖ నగరాలను మెగాసిటీలుగా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. విశాఖ, నెల్లూరులలో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. అనంతపురంలో కరువు నివారణక బిందు, తుంపర సేద్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. శ్రీకాకుళంలో విమానాశ్రయం ఏర్పాటు చేసి స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, కర్నూలు, కడప జిల్లాల్లో సిమెంట్‌ పరిశ్రమలు, పలు ప్రాంతాల్లో క్లస్టర్లు, ఇండస్టియ్రల్‌ జోన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఐటీ హబ్‌గా విశాఖను మారుస్తామని, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఎల్‌అండ్‌ టీ టెర్మినల్స్‌, మచిలీపట్నంలో రిఫైనరీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటిస్తామన్నారు.

జిల్లాల వారీగా కేటాయింపులు

ఏ జిల్లాలో ఏయే పరిశ్రమలు, ప్రాజెక్టులు, విద్యాసంస్థలు ఏర్పాటు చేయనున్నారో ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు అసెంబ్లీలో విడుదల చేసిన 20 పేజీల ప్రకటనలో జిల్లాల వారీగా కేటాయించిన విద్యాసంస్థల, ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు.

జిల్లా            కేటాయింపులు

విశాఖపట్నం        మెగాసిటీ, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ హబ్‌, మెట్రో రైలు

తూర్పుగోదావరి    పెట్రోలియం యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయం, పోర్టు, ఐటీ హబ్‌

విజయనగరం        గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం, పారిశ్రామిక నగరం, ఫుడ్‌ పార్క్‌, గిరిజన యూనివర్సిటీ

పశ్చిమ గోదావరి     ఎన్‌ఐటీ, నర్సాపూర్‌ పోర్టు, సిరామిక్‌ పరిశ్రమ, పోలవరం ప్రాజెక్టు

కృష్ణా            గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, ఫుడ్‌ పార్కు, ఐటీ హబ్‌

గుంటూరు        మెట్రో, టెక్స్‌టైల్‌ పార్క్‌, ఎయిర్‌పోర్టు, వ్యవసాయ వర్సిటీ, ఎయిమ్స్‌, ఎన్టీఎంఏ

ప్రకాశం            పారిశ్రామిక నగరంగా దొనకొండ, ఒంగులులో ఎయిర్‌పోర్టు,రామాయంపేటలో పోర్టు

నెల్లూరు        ఆటోమొబైల్‌ హబ్‌, ఎయిర్‌పోర్టు, దుగరాజపట్నం పోర్టు

కర్నూలు        స్మార్ట్‌ సిటీ, ఎయిర్‌పోర్టు, పారిశ్రామికకారిడార్‌, విత్తనోత్పత్తి కేంద్రం, మైనింగ్‌స్కూల్‌

చిత్తూరు        అంతర్జాతీయ విమానాశ్రయం, కుప్పం ఎయిర్‌పోర్టు, ఐఐటీ, ఐటీ హబ్‌, మెట్రో

కడప            స్టీల్‌ ప్లాంట్‌, సిమెంట్‌ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ, ఉర్దూ వర్సిటీ

అనంతపురం        ఉద్యానకేంద్రం, స్మార్ట్‌ సిటీ, ఫుడ్‌పార్క్‌, టెక్స్‌టైల్‌ పార్క్‌, సెంట్రల్‌ వర్సిటీ

శ్రీకాకుళం        భావనపాడు, కళింగపట్నం ఎయిర్‌పోర్టు, స్మార్ట్‌సిటీ, ఫుడ్‌కోర్టు, పారిశ్రామిక నగరం

రాజధాని ప్రకటనపై భగ్గుమన్న సీమ

ఏపీ సీఎం చంద్రబాబు చేసిన రాజధాని ప్రకటనపై రాయలసీమ భగ్గుమంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటుచేయనున్నట్టు అసెంబ్లీలో సిఎం  చంద్రబాబు ప్రకటన చేయడంతో రాయలసీమలో ఆందోళనలు మిన్నంటాయి. కర్నూలులో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కర్నూలు రాజధాని చేయాలంటూ న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. మెడికల్‌ కాలేజీ సవిూపంలో ¬ర్డింగ్‌ విూదకు ఎక్కి విద్యార్థులు ఆందోళనకు దిగారు. అనంతపురం ఎస్కేయూలోనూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనంతపురం-చెన్నై రాహదారిని దిగ్బంధించారు. క్లాక్‌ టవర్‌ వద్ద బీసీ సంఘాలు నేతలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ మన రాయలసీమ, బీసీ, ఎస్టీ ఎస్సీ, మైనారిటీ విద్యార్థి సంఘం నేతృత్వంలో అనంత నగర గడియారపు స్తంభం వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో అన్నివిధాలుగా వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసారు.  అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయంలో బంద్‌ నిర్వహించారు. వర్శిటీలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎస్కేయూ ముఖద్వారం ఎదురుగా జాతీయరహదారిని దిగ్భందించారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. రాజధాని ఏర్పాటు చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని విద్యార్థులు పేర్కొన్నారు. రాజధాని ఏర్పాటు చేసేవరకు రాయలసీమ రాజధాని పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మరోవైపు రాయలసీమ వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ కడప, కర్నూలు జిల్లాల్లో విద్యార్థి సంఘాలు బంద్‌పాటిస్తున్నాయి. కడప బస్టాండ్‌, కోటిరెడ్డి కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.