జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడ్డాం
రూ.10కోట్లతో సంక్షేమ నిధి
హెల్త్‌కార్డులు, అన్ని హంగులతో జర్నలిస్టు భవన్
జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించిన కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (జనంసాక్షి) : జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. రూ.10కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. అలాగే హెల్త్‌కార్డులు ఇస్తామని, అన్ని హంగులతో జర్నలిస్టు భవన్ నిర్మాణం చేపడుతామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలపై గురువారం ఆయన సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం రూ.10 కోట్లను ఈ బడ్జెట్‌లోనే కేటాయించేందుకు ఆయన అంగీకరించారు. గతంలో ఇచ్చిన హావిూలన్నింటినీ అమలుచేస్తామని ఉద్ఘాటించారు. హెల్త్‌కార్డులు, అక్రిడేషన్లు సహా జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన అన్ని అంశాలపై మెదక్ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత పూర్తిస్థాయిలో సవిూక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రెస్ అకాడవిూ చైర్మన్ అల్లం, సమాచార ప్రసారశాఖ ముఖ్య కార్యదర్శి చంద్రవదన్, ప్రభుత్వ సలహాదారు రమణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ అకాడవిూ విధివిధానాల ఖరారు, జర్నలిస్టుల హెల్త్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డుల మంజూరు వంటి అంశాలపై చర్చించారు. ప్రధానంగా జర్నలిస్టుల సంక్షేమం, హెల్త్‌కార్డులు, అక్రిడేషన్ కార్డుల మంజూరుపై చర్చ జరిగింది. అలాగే, రెండు టీడీ చానెళ్ల ప్రదర్శన నిలిపివేతపైనా చర్చించినట్లు సమాచారం. జర్నలిస్టుల సంక్షేమ నిధికి ప్రకటించిన రూ.10 కోట్ల మొత్తాన్ని ఈ బడ్జెట్‌లోనే కేటాయించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. త్వరలోనే హెల్త్‌కార్డులు కూడా మంజూరు చేస్తామని తెలిపారు. ఇళ్ల స్థలాలపై కూడా దృష్టి సారిస్తామని హావిూ ఇచ్చారు. త్వరలోనే విూడియా కోసం కొత్త ప్రకటనల విధానాన్ని కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకొని విధివిధానాలు ఖరారు చేసుకోవాలని సూచించారు. ప్రెస్ అకాడమీ నామమాత్రంగా మిగిలిపోవద్దని, చాలా క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ జర్నలిస్టుల్లో వృత్తి నైపుణ్యం పెంచేందుకు, సాంకేతిక పరిజ్ఞానం కలిగించేందుకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. పత్రికలు, ఛానెళ్ళలో ఆంధ్రా ధోరణి కనిపిస్తోందని, ఈ విషయంలో ప్రెస్ అకాడమీ చొరవ చూపించి మార్పు తీసుకురావాలని సిఎం సూచించారు. ప్రెస్ అకాడమీకి నిధుల కొరత రానివ్వమని, అవసరమైన నిధులు పూర్తిస్థాయిలో వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు. జర్నలిస్టుల సంక్షేమానికి మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను అమలుచేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు.