తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య

5

బ్రిటన్‌ సహకారం తీసుకుంటాం

ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను తెలంగాణలో అందించడానికి ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి కొత్త కార్యక్రమాలు, కొత్త పథకాలు అమలుచేస్తుందని, ఇందుకు బ్రిటన్‌ సహకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. సచివాలయంలో బ్రిటన్‌ సాంస్కృతిక వ్యవహారా మంత్రి రాబ్‌లైన్స్‌, బ్రిటన్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూమెక్‌ అలిస్టర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకున్నారు. విద్య, ఆరోగ్యం, పర్యావరణం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకునే విషయాలపై చర్చించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుందని, అవి చాలా బాగున్నాయని బ్రిటన్‌ ప్రతినిధులు అభినందించారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి, తెలంగాణ గ్రిన్‌కవర్‌ పెంచడానికి, విద్యార్థులకు ఇంగ్లీష్‌ మీడియంలో ఉచిత నిర్బంధ విద్య అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలను వారు మెచ్చుకున్నారు. ఈ రాంగాల్లో తెలంగాణ ప్రభుత్వానికి తాము కూడా సహకరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణలో వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి విద్యారంగంలో సమూల మార్పులు తెస్తామని, ఇంగ్లీష్‌ మీడియంలో ఉచిత నిర్బంధ విద్య అందిస్తామని చెప్పారు. ఇందుకోసం మాస్టర్‌ ట్రైనర్లకు అవసరమైన శిక్షణను అందించడానికి సమకరించాలని సిఎం బ్రిటన్‌ ప్రతినిధులను కోరారు. తెలంగాణ ఇంజినీరింగ్‌ కాలేజీలను పరిశ్రమలకు అనుసంధానం చేస్తున్నామని, దీనివల్ల విద్యార్థులు చదువుకునే సమయంలోనే వృత్తి విద్యను నేర్చుకుంటారని, వృత్తి నైపుణ్యం కూడా పెరుగుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంలో కూడా బ్రిటన్‌ సహకారం అవసరమని సిఎం కోరారు. బ్రిటన్‌ మ్యూజియంల నిర్వహణ కూడా బాగుంటుందని, బ్రిటీష్‌ మ్యూజియం లీడర్‌షిక్‌ ప్రోగ్రాం కూడా అక్కడ ఉందని సీఎం చెప్పారు. షేక్‌స్పియర్‌ ఇంటిని హెరిటేజ్‌ ప్రాపర్టీగా మార్చారని అభినందించారు. వాతావరణ సమతుల్యం కోసం గ్రీన్‌ మాస్టర్‌ ప్లాన్‌ కార్యక్రమాలకు తమ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రికి బ్రిటన్‌ ప్రతినిధులు హామీనిచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పరిశ్రమల శాఖ కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.