భారత్ ప్రపంచానికే అధ్యాపకుడు కావాలి
ఇంటర్నెట్ సమాచారమే.. విజ్ఞానం కాదు
విద్యార్థులతో ప్రధాని నరేంద్రమోడీ ముఖాముఖి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5 (జనంసాక్షి) : ప్రపంచానికే భారతదేశం అధ్యాపకుడు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్షించారు. ఇంటర్నెట్ సమాచారమే తప్ప విజ్ఞానం కాదన్నారు. భారత తొలి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5 గురుపూజోత్సవం పురస్కరించుకుని దేశంలోని విద్యార్థులతో అంతర్జాలం ద్వారా ముఖాముఖి నిర్వహించారు. ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి మార్గదర్శకుడని, అతనికి దశదిశ నిర్దేశనం చేసేవాడు గురువేనని, సమాజంలో గురుకున్న పాత్ర ఎంతో కీలకమైందని మోడీ అన్నారు. ఢిల్లీలోని ఓ ఆడిటోరియంలో 700 మంది విద్యార్థులతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాన్ని దేశంలోని పశ్చిమ బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాలకు చెందిన 12,500 పాఠశాలల్లోని సుమారు కోటి 20లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. నేటి విద్యార్థుల్లో ఉపాధ్యాయులపట్ల నానాటికి గౌరవం సన్నగిల్లుతోందని, విద్యాపరంగా ఏవేని అనుమానంవస్తే గూగుల్‌లోకి వెళితే సమాచారం లభిస్తుందని, ఉపాధ్యాయుడి అవసరాన్ని గుర్తించడం లేదని ప్రధాని ఆవేదన వ్యక్తంచేశారు. మన చరిత్ర, పురాణాల్లో గురువుకున్న ప్రాధాన్యతను గుర్తించాలని ఈ సందర్భంగా ఏకలవ్యుడు చరిత్రను విద్యార్థుల దృష్టికి తీసుకొచ్చారు. గూగుల్ తాత్కాలిక సమాచారం ఇస్తుందితప్ప జ్ఞానాన్ని ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రతి విద్యార్థి డాక్టర్, ఇంజినీర్, శాస్త్ర, సాంకేతికంవైపు మొగ్గుచూపుతున్నారని, ఇందులో తప్పులేదని, అయితే ఉపాధ్యాయులం ఎందుకు కాకూడదని ఆలోచించడం లేదన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల కొరత ఎంతో ఉందని, ఈ కొరతను తీర్చే సత్తా భారతదేశానికి ఉందన్నారు. ఉపాధ్యాయ వృత్తినుండి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్య ద్వారా జీవన నిర్మాణం జరిపారు తప్ప అతను ఏనాడూ పుట్టినరోజు జరుపుకోలేదన్నారు. జాతి నిర్మాణం, దేశ భవిష్యత్ కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. తనకు ఉపాధ్యాయ సహకారం కావాలని, ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని అందివ్వాలని సూచించారు. ప్రతి కుటుంబం బాలికకు విద్యాపరంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని తల్లిదండ్రులకు ఉద్బోధించారు. బాలిక విద్యాపరంగా ఉన్నతురాలైతే పుట్టినిల్లుతోపాటు మెట్టినిల్లుకు కూడా ప్రయోజనం చేకూరగలదన్నారు. విద్యతోపాటు విద్యార్థులు ప్రకృతి అస్వాదించాలన్నారు. పరిసరాలను ప్రేమించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. రాజకీయ పదవులు అనేవి వస్తూ పోతుంటాయని, కానీ రాజకీయాలను వృత్తిగా భావించవద్దని, సేవగా భావించాలని హితవు పలికారు. మనంచేసే పనులే మనలను చరిత్రలో నిలుపుతాయని అన్నారు. మీరు ఎంతస్థాయిలో ఉన్నా, ఏ పనిచేస్తున్నా వారంలో ఒకగంట పాటు ఏదో ఒక పాఠశాలలకు వెళ్ళి పాఠాలు బోధించండి, అప్పుడే కలిగే అనుభూతి గురుకున్న విలువేందో అర్థమవుతుందన్నారు. చదువు ఒకటే కాదు ప్రతి విద్యార్థికి ఆటపాటలు కూడా ఎంతో అవసరమన్నారు. ఇవి లేకపోతే జీవితం అసంపూర్ణమే అవుతుందన్నారు. పుస్తకాలు చదవటం, టీవీలు చూడడం, కంప్యూటర్ చూడడం ఇది జీవితం కాదన్నారు. ప్రతి వారికి శారీరకంగా చమట పట్టాలని, ముఖ్యంగా ఈ వయసులో నాలుగైదుసార్లు ఒంటినిండా చెమటాలు పట్టాలన్నారు. దీంతో శారీరక దృఢంతో పాటు మానిసికోల్లాసం కూడా లభిస్తుందన్నారు. నేడు గ్రామాల్లో ఎవరికైనా మంచి గౌరవం ఉందంటే అది ఒక్క ఉపాధ్యాయుడికేనని నేను సగౌరవంగా చెప్పగలనని అన్నారు. ఇకనుంచి పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేవనే ప్రశ్న రాకూడదని, ఇందుకు దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడదామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 5వ తరగతిలోని బాలికలు విద్యను అర్ధాంతరంగా ఆపేస్తున్నారని, ఇకనుండి వారికి అతి సమీపంలోనే పాఠశాలలను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఉపాధ్యాయులు పాటించే కేశ, వస్త్ర అలంకరణాలను విద్యార్థులు పాటిస్తారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు భారతీయ సంస్కృతిని చాటిచెప్పే విధంగా వారిని తీర్చిదిద్దాలన్నారు. జపాన్‌లో మాదిరిగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసికట్టుగా పనిచేసే విధానాన్ని అలవర్చుకోవాలని మోడీ సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పరిశీలన దృక్పథాన్ని బోధించి భారత్ ప్రపంచానికి ముఖ్య గురువు కావాలన్నారు. ఈ సందర్భంగా దేశంలోని ఉపాధ్యాయులకు ప్రధాని మోడీ గురుపూజోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులతో ప్రధాని ముఖాముఖి కార్యక్రమంలో పలువురు విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ మ¬న్నత వ్యక్తిత్వం గురించి ప్రధాని ముందు వివరించారు. గురుపూజోత్సవ ఔన్నత్యాన్ని వారు తమ మాటల్లో వర్ణించి చెప్పారు. రాధాకృష్ణన్ నిరాడంబరత అందరికీ ఆదర్శం కావాలని పిల్లలు చెప్పిన వైనం ప్రధానిని ఆకట్టుకుంది. ప్రధాని మోడీ వారందరికీ భగవద్గీతను బహూకరించారు. కోటి 20 లక్షల మంది విద్యార్థులతో ప్రత్యక్ష ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు మోడీకి ప్రశ్నలు వేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ దేశంలోని అన్ని భాషల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో భవిష్యత్తును నిర్దేశించే బాలలతో మాట్లాడటం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో అందరూ ఉపాధ్యాయ దినోత్సవ ఔన్నత్యాన్ని గుర్తించాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పరిశీలనా దృక్పథం కల్పించాలన్నారు. విజ్ఞాన సమాజానికి భారత్ విశ్వగురువు కావాలన్నారు. భారతదేశ భావికలలన్నీ మోస్తున్న పిల్లలతో మాట్లాడే అవకాశం లభించినందుకు గర్విస్తున్నానని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఆయన ఢిల్లీ మానెక్షా ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖిలో మాట్లాడారు. ఒక్క పశ్చిమ బెంగాల్ తప్ప మిగిలిన దేశంలోని 18 లక్షల పాఠశాలల్లో ఈ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఎప్పటికప్పుడు మారుతుండాలి. ఎలా మారాలో అందరూ ఆలోచించాలి. చాలా సమర్థులైన విద్యార్థులు ఎందుకు ఉపాధ్యాయులు కావాలనుకోవడం లేదో అంతా చూడాలి. మంచి టీచర్లకు చాలా డిమాండ్ ఉంది. భారత్ యువదేశం. మన దేశం నుంచి మంచి టీచర్లను ఎగుమతి చేయగలమన్న విశ్వాసం మనం ఇవ్వలేమా? నేను కూడా మంచి ఉపాధ్యాయుడినయ్యి.. దేశానికి సేవ చేయగలనన్న భావన విద్యార్థులలో నెలకొల్పలేమా? సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి మంచి సేవ చేశారు. ఆయన తన జయంతి చేయొద్దని, ఉపాధ్యాయ దినోత్సవం చేయాలని దేశానికి చెప్పారు. గొప్పవాళ్లందరి జీవితాలను తీర్చిదిద్దడంలో తల్లి, గురువులే ప్రధానపాత్ర పోషిస్తారు. చిన్న గ్రామంలో ఎవరికైనా మంచి గౌరవం ఉందంటే.. అది కేవలం ఉపాధ్యాయుడికే. ఇంట్లో అమ్మానాన్నలకు చెప్పుకోలేని విషయాలు కూడా ఉపాధ్యాయులకు చెప్పుకోగలం. టీచర్లంటే విద్యార్థుల పాలిట హీరోలు.అంటూ ఉద్బోధించారు. విూరు ఎంత పెద్ద స్థానంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా కూడా.. వారంలో ఒక్క రోజు.. ఒక్క గంట పాటు వెళ్లి ఏదో ఒక పాఠశాలలో పాఠాలు బోధించండి. అన్ని రకాల శక్తులు కలిసి విద్యార్థులకు తమ విజ్ఞనాన్ని అందిస్తే మంచిది. అస్తమాను పుస్తకాలు చదవడం, టీవీలు, కంప్యూటర్లు చూడటం.. ఇదే జీవితం కాదు.. దీనికంటే చాలా ఉంది. తరగతి పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు చదివేవాళ్లు ఎంతమంది ఉన్నారు? జీవిత చరిత్రలు ఎంతమంది చదువుతారు… ఇది చాలా తక్కువే. ఇప్పుడు పనులన్నీ గూగుల్ గురువే చేస్తారు. ఏ సమస్య ఉన్నా గూగుల్ గురువే చెబుతుంది. అది సరికాదు. గురుముఖత నేర్చుకుంటే మంచిది ప్రధాని చెప్పారు. దీంతో చప్పట్లతో విద్యార్థులు ప్రధానిని అభినందించారు.