ఏపీ సర్కారుకు కాగ్‌ మొట్టికాయ

1

పథకాల ప్రయోజనం శూన్యం

కోట్లాది రూపాయల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే

అన్నింటా అవకతవకలే

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సర్కారుకు కాగ్‌ మొట్టి కాయ వేసింది. ప్రభుత్వ ప నితీరుపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పథకాల ప్రయోజనం శూన్యమని, కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరేనని చెప్పింది. అన్నింటా అవకతవకలేనని ఎత్తిచూపింది. రాష్ట్రంలో ఆరు ప్రధాన రంగాలకు సంబంధించి వివిధ అంశాలపై కాగ్‌ తూర్పారబట్టింది. గోదావరి, వంశధార, నాగావళి వరదకట్టల నిర్మాణంలో లోపాలున్నాయని వెల్లడించింది. దీనివల్ల రూ.904కోట్ల నష్టం జరిగిందని తెలిపింది. రోడ్లు, భవనాల శాఖలో రోడ్ల నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారని మండిపడింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) విధానం అమలు తీరులో సరైన ప్రమాణాలు పాటించలేదని ఆక్షేపించింది. అటవీ భూముల మళ్లింపులో నిబంధనలు అతిక్రమించారని ఆరోపించింది. చివరకు ఎత్తిపోతల పథకాలపై కూడా నిర్లక్ష్యం వహించారని మండిపడింది. కాగ్‌ సమర్పించిన నివేదికను చంద్రబాబు ప్రభుత్వం శనివారం అసెంబ్లీకి సమర్పించింది. ఆర్థిక, సామాజిక రంగం, ప్రభుత్వ రంగ సంస్థల్లో కాగ్‌ నివేదికలను సమర్పించింది. రహదారుల రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం ప్రాజెక్టుల్లో అవకతవకలను కాగ్‌ ఎండగట్టింది. నీటిపారుదల శాఖలో అక్రమాలను నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యల పట్ల కాగ్‌ అసంతృప్తి వ్యక్తంచేసింది. వైద్యారోగ్య శాఖ పనితీరు సక్రమంగా లేదని, నిధులు దారి మళ్లుతున్నాయని కాగ్‌ ఆగ్రహం వ్యక్తంచేసింది. చివరకు బయోమెట్రిక్‌ విధానం లేకపోవడంతో పౌరసరఫరాల శాఖలో నిధులు దుర్వినియోగమవుతున్నాయని తెలిపింది. బోగస్‌ కార్డులు ఎక్కువగా ఉన్నాయని, కుటుంబాల సంఖ్య కంటే రేషన్‌కార్డుల సంఖ్య ఎక్కువగా ఉందని ఎత్తిచూపింది. తాగునీటి ప్రాజెక్టుల కోసం కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేదని పేర్కొంది. విద్యాశాఖలోని రూ.54 కోట్ల నగదు ప్రభుత్వ ఖాతాలోకి బదులు సొంత ఖాతాల్లోకి వెళ్లాయని మండిపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. ఆ పని చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నదుల్లో ఇసుకు తవ్వుతున్నారని. దీనివల్ల ముంపు ఏర్పడుతోందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

కాగ్‌ నివేదికలోని పలు అంశాలు

– గోదావరి, వంశధార, నాగవళి వదర కట్టల కోసం కేంద్ర ఆర్థిక సాయం నిలిచిపోవడానికి నీటిపారుదల శాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఫలితంగా రూ.844 కోట్ల ఆర్థిక సాయం నిలిచిపోయింది

– 66 వరద కట్టలకు గాను 48 పనులు పూర్తి కాలేదు. రూ.927 కోట్లు ఖర్చు చేసినా వరద ముంపు నుంచి రక్షణ కల్పించాలన్న లక్ష్యం నెరవేరలేదు.

– వంశధార వరద కట్టలకు సంబంధించి గిరష్ట వరద ప్రవాహ స్తాయి విసయంలో సంశయం వల్ల గుత్తేదారు/-లు పనులు నిలిపివేసి నాలుగెళ్లవుతున్నా.. ఆ శాఖ ఎటువంఇ నిర్ణయం తీసుకోకపోవడంపై కాగ్‌ మండిపడింది.

– 339 హెక్టార్ల అటవీ భూమి ఇతర అవసరాలకు మళ్లింపు జరిగినా దానికి సమానంగా భూమిని సేకరించడంలో ఆ శాఖ నిర్లక్ష్యాన్ని కాగ్‌ ఆక్షేపించింది

– ఎలాంటి అనుమతులు లేకుండా 102 హెక్టార్ల అటవీ భూముల మళ్లింపు, 45 హెక్టార్ల  ఆక్రమణలపై ఆ శాఖ నిర్లక్షాన్ని కాగ్‌ ఎండగట్టింది.

– నీటిపారుదల ఆధునికీకరణ పనుల పురోగతి అధ్వానంగా ఉందని కాగ్‌ మండిపడింది. 87 ఆధునికీకరణ పనుల్లో కేవలం నాలుగే పూర్తయ్యాయని, రూ.2,528 కోట్లు వెచ్చించిన ఆశించన లక్ష్యాలు నెరవేరలేదని తూర్పారబట్టింది.

– తుంగభద్రత ప్రాజెక్టు ఎగువ కాలువ విషయంలో పొరుగురాష్ట్రం సమ్మతి తీసుకోకుండా రూ.కాలువ వెడల్పు పనులు చేపట్టారని, ఇప్పటికీ ఒప్పందం లేకపోవడంతో రూ.161 కోట్లు ఖర్చు అయినా ప్రయోజనానికి గండిపడిందని తెలిపింది

– కృష్ణా డెల్టా వ్యవస్థ ఆధునికీకరణ పనుల్లో జాప్యం కారణంగా 20 టీఎంసీల నీటి మిగులు సాధించలేకపోయినట్లు కాగ్‌ తెలిపింది. ఫలితంగా రాజీవ్‌ బీమా ఎత్తిపోతల, పులిచింతల ప్రాజెక్టులకు నీటి లభ్యత వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది.

– కడప-పులివెందుల రహదారిపై ట్రాఫిక్‌ స్వల్పంగా ఉన్నా నాలుగు లేన్ల రోడ్డుగా వెడల్పు చేసి పనులు

చేపట్టడంపై కాగ్‌ అభ్యంతరం తెలిపింది. రాజమండ్రి వద్ద గోదావరి నది వంతెనపై వెల్‌ ఫౌండేషన్‌కు బదులుగా ఫైల్‌ ఫౌండేషన్‌గా డిజైన్‌ మార్చడం వల్ల రెండున్న వేల కోట్ల అదనపు బారం పడిందని ఆక్షేపించింది.