తెలంగాణలో భారీ వర్షాలు
సింగరేణిలో వరదనీరు
ఓపెన్‌కాస్ట్‌లో నిలిచిపోయిన ఉత్పత్తి
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (జనంసాక్షి)::
తెలంగాణలోని పలు జిల్లాల్లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సింగరేణిలో వరదనీరు చేరడంతో ఎపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల వాగులు, కట్టలు తెగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కరీంనగర్ జిల్లా సింగరేణి ఆర్‌జీ 1, 2, 3, 4 ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణికి కోట్లల్లో నష్టాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. వీలైనంత త్వరగా నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. మరోవైపు, జిల్లాలోని మహదేవ్‌పుర్‌లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్దంపేట, పుల, వంకైన, సర్వాయిపేట, ఇప్పల వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవాహిస్తున్నాయని. దీంతో 17గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వరంగల్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కాకతీయ ఖని ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బొగ్గు రవాణా చేసే టిప్పర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దాదాపు 3,200 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, 50లక్షల క్యూబిక్ విూటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లానూ భారీ వర్షాల ముంచెత్తాయి. కుండపోతగా కురుస్తోన్న వర్షాలతో వాగులు ఉద్ధృతంగా పొంగిపొర్లుతున్నాయి. బెజ్జూరు మండలంలో కృష్ణపల్లి, కుకుడ, కాగజ్‌నగర్‌లోని పెద్దవాగా ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. వేమనపల్లి మండలంలో గొర్లపల్లి ప్రమాదకరంగా ప్రవహిస్తుండడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన : రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజగుట్ట, సికింద్రాబాద్, మారేడుపల్లి, బేగంపేట, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
భారీ వర్ష సూచన : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదివారం కూడా కోస్తాంధ్ర, తెలంగాణల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని ప్రకటించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.