సీమాంధ్ర మీడియాకు తెలంగాణలో స్థానంలేదు

5

తెలంగాణ ఛానెళ్లు, పత్రికలు ఆంధ్రాలో ఎందుకుండవు ?

పత్రికా స్వేచ్ఛ అంటే ఇదేనా?

ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌

అల్లం నారాయణ

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) :

సీమాంధ్ర మీడియాకు తెలంగాణలో స్థానంలేదని ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ ఛానెళ్ళు, పత్రికలు ఆంధ్రా ప్రాంతంలో ఎందుకుండవని ఆయన ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛ అంటే ఇదేనా అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. శనివారం నగరంలోని ప్రెస్‌ అకాడమీ లో జరిగిన తెలంగాణ చిన్న, మధ్య తరహా దినపత్రికల సమస్యలపై చర్చా కార్యక్రమంలో  ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన నేపథ్యంలో ఇక మీదట సీమాంధ్ర ప్రాంత పాత్రికేయ సంఘాలు, పత్రికల యజమానులు తెలంగాణ పత్రికలకు చేసిన అన్యాయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రాంత చిన్న, మధ్యతరహా పత్రికల యాజమాన్యాలకు, సంపాదకులకు తీరని అన్యాయం జరిగిందన్న వాస్తవం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ సీమాంధ్ర ప్రాంత యాజమాన్యాలు నడిపే పత్రికలను తెలంగాణ రాష్ట్రంలో ప్రయోజనాలు పొందేందుకు అనుమతించేది లేదని కరాఖండిగా చెప్పారు. ఒకవేళ అటువంటి ప్రయత్నాలు జరిగితే టియుడబ్ల్యుజె తరపు కచ్చితంగా అడ్డుకుని తీరతామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్ర నిధులతో ప్రయోజనాలను పొందుతున్న సీమాంధ్ర పత్రికలు తమ ప్రయోజనాల వరకు వచ్చేసరికి పత్రికా స్వేచ్ఛ అంటూ గగ్గోలు పెడుతున్నారని, అదే సీమాంధ్ర ప్రాంతంలో మాత్రం తెలంగాణ పత్రికలు, ఛానెళ్ళను ప్రసారం చేయడంలేదని తెలిపారు. సమైక్య రాష్ట్రం విడిపోయే తరుణంలో ఎటువంటి వైషమ్యాలు తలెత్తరాదన్న సదుద్దేషంతో ‘విభజన వికాసం కొరకే’ పేరుతో తాము నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రతులను, వాహనాన్ని ఆంధ్రా ప్రాంతానికి పంపితే దహనం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ కార్యకలాపాలను కవరేజీ చేసేందుకు వెళ్ళిన నమస్తే తెలంగాణ దినపత్రిక, టి-న్యూస్‌, వి6 ఛానెళ్ళ విలేకరులకు పాస్‌లు కూడా నిరాకరించిన ఆ ప్రభుత్వం తమ వార్తలు మీకు అవసరమా అటూ ఎద్దేవా చేశారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లే ఎటువంటి ప్రయత్నానయినా టియుడబ్ల్యుజె వ్యతిరేకించి తీరుతుందని అల్లం నారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి, ఉపాధ్యక్షులు పల్లె రవి, డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ ఎం.వి.రమణ, రాష్ట్ర కార్యదర్శులు ఇస్మాయిల్‌, రమేష్‌ హజారి, అవ్వారి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.