ఉద్యోగుల పదోన్నతి దస్త్రంపై కేసీఆర్ సంతకం
గత ప్రభుత్వ నిషేధం తొలగింపు
సర్కారు నిర్ణయంపై దేవీప్రసాద్ హర్షం
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (జనంసాక్షి) :
ఉద్యోగుల పదోన్నతి దస్త్రంపై కేసీఆర్ సంతకం చేశారు. గత ప్రభుత్వం పెట్టిన నిషేధాన్ని తొలగించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తెలంగాణ ఎన్‌జిఓ సంఘం అధ్యక్షులు దేవీప్రసాద్ హర్షం వ్యక్తంచేశారు. దేవీప్రసాద్ తోపాటు, సంఘం ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా అనేక సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు. 10వ పీఆర్‌సి, ఆరోగ్య కార్డులు, దసరాలోగా ఇవ్వాలని కోరగా త్వరలోనే పిఆర్‌సి, ఇతర సమ్యలపై అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని సీఎం హామీనిచ్చారు. అలాగే పెన్షనర్లకు తెలంగాణ ఇన్‌సెంటివ్, 1969 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన పెన్షనర్లకు న్యాయం చేస్తామన్నారు. జిల్లాస్థాయయి ప్రమోషన్లు, కారుణ నియామకాలపై గత ఏపీ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. గత 6 నెలలుగా అనేక మంది ఉద్యోగులు ప్రమోషన్లు రాక పడుతున్న ఇబ్బందులు ఈ ఆదేశాలతో తొలగిపోయాయి. రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రంథాలయ ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించే విషయమై సీఎం హామీనిచ్చారు. టైమ్‌స్కేల్‌లో పనిచేస్తున్న సిబ్బందిని క్రమబద్దీకరణ చేయాలని ఉద్యోగులు కోరారు. 20 సంవత్సరాలుగా పీఆర్‌సీ ద్వారా వేతనాలు పొందుతున్నా వారి క్రమబద్దీకరణ జరగలేదన్నారు. అలాగే కమలనాథన్ కమిటీని కలిసి విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలిసి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై వేసిన కమిటీకి ఉద్యోగులు సమస్యలు వివరించారు. ఈ సమావేశాల్లో ఐకెపి ఉద్యోగ సంఘం నాయకులు గంగిరెడ్డి, సుదర్శన్, గ్రంథాలయ సంస్థ నాయకులు సోమయ్య, అయోధ్య, గృహ నిర్మాణ శాఖ నాయకులు అప్పారావు, రవీందర్‌రెడ్డి, కొండయ్య, మోహన్, అర్జున్‌రావు, కస్సూరి వెంకటేశ్వర్లు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.