మలివిడత కౌన్సెలింగ్‌కు సుప్రీం నో

4

ఏపీ ఉన్నత విద్యామండలికి చుక్కెదురు

గడువులోగా సీట్లెందుకు భర్తీ చేయలేదు

ఖాళీ సీట్లకు మీరే కారణం

ఏపీ విద్యామండలిని తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) :

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ మలివిడత కౌన్సెలింగ్‌ నిర్వహణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కౌన్సెలింగ్‌కు సెప్టెంబర్‌ 30 వరకు గడువు పొడిగించాలని చేసిన విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం పిటిషన్‌ను తోసిపుచ్చింది. గడువులోగా సీట్లెందుకు భర్తీచేయలేదని కోర్టు ప్రశ్నించింది. ఖాళీ సీట్లకు విద్యామండలే కారణమని చెప్పింది. రెండో విడత కౌన్సెలింగ్‌కుఅనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యామండలి చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. కౌన్సెలింగ్‌కు పదే పదే గడువు కోరడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. అవసరమైనంత గడువు ఇచ్చామని.. సకాలంలో ఎందుకు కౌన్సెలింగ్‌ పూర్తిచేయలేదని ఘాటుగా ప్రశ్నించింది. గతంలో ఇచ్చిన షెడ్యూల్‌నే కొనసాగించాలని స్పష్టంచేసింది. ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఆగస్టు 31లోగా కౌన్సెలింగ్‌ పూర్తిచేసి సెప్టెంబర్‌ 1 నుంచి క్లాసులు ప్రారంభిస్తామని ఉన్నతవిద్యామండలి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. అందుకు భిన్నంగా రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలని తాజాగా పిటిషన్‌ దాఖలుచేసింది. ఇప్పుడు గడువు పొడిగిస్తే భవిష్యత్‌లో మళ్లీ అడగరని గ్యారంటీ ఏమిటని సూటిగా ప్రశ్నించింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, మళ్లీ గడువు కోరడం ఏమిటని న్యాయమూర్తి జస్టిస్‌ ముఖోపాధ్యాయ ఉన్నత విద్యామండలిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు అనుమతి ఇస్తే భవిష్యత్తులోనూ ఇలాగే కోరుతారని తెలిపారు. గడువు పెంచాలని పదేపదే అడుగొద్దని స్పష్టంచేశారు.. అయితే, రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వకపోతే 65 వేల సీట్లు ఖాళీగా ఉంటాయని ఉన్నత విద్యామండలి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ… ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ఖాళీఉ సీట్లు ఉండనివ్వండి.. అలా ఉన్నాయంటే తప్పు విూదే అని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్నా అనుమతి ఇచ్చేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.అఖిల భారత సాంకేతిక విద్యామండలికి ఫిర్యాదుచేస్తామన్న ఏపీ ఉన్నత విద్యామండలిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఏఐసీటీఈ ద్వారా బీ-కేటగిరి ఖాళీలు భర్తీచేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. తాము అనుమతి ఇవ్వకుండా ఏఐసీటీఈ ఎలా అంగీకరిస్తుందని మండిపడింది. సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభమైనందును కౌన్సెలింగ్‌ గడువు పొడిగించలేమని తేల్చి చెప్పింది. పదే పదే గడువు పొడిగింపు కోరడం సమంజసం కాదని న్యాయస్థానం పేర్కొంది. గతంలో ఇచ్చిన షెడ్యూల్‌నే కొనసాగించాలని న్యాయమూర్తి స్పష్టం చేస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఎంసెట్‌పై గతంలో తాము ఇచ్చిన సూచనలకే కట్టుబడి ఉండాలని తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి అభిప్రాయాలను  లెక్క చేయకుండా రెండో విడత కౌన్సెలింగ్‌ చేపట్టేందుకు యత్నించిన ఏపీ ఉన్నతవిద్యామండలికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం రెండో విడత కౌన్సెలింగ్‌కు విముఖత వ్యక్తంచేస్తూ వచ్చింది. అయితే, దాన్ని పట్టించుకొని ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టు తలుపుతట్టింది. రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రవేశాలకు సెప్టెంబర్‌ 30 వరకు గడువు పొడిగించాలని కోరింది. 65 వేల సీట్లు మిగిలిపోయాయని, వాటిని భర్తీ చేయాల్సి ఉందని తెలిపింది. అయితే, అనుమతి ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం.. సీట్లు ఖాళీగా ఉన్నాయంటే అందుకు బాధ్యత విూదేనని తేల్చి చెప్పింది.

గందరగోళంలో విద్యార్థులు :

సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. రెండో విడత కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు, మొదటి విడతలో సీట్లు దక్కించుకొని స్లైడింగ్‌ కొరకు ఎదురుచూస్తున్న విద్యార్థులకు తాజా ఆదేశాలతో ఇబ్బందికర పరిణామాలు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో దాదాపు 65వేల ఇంజినీరింగ్‌ సీట్లు మిగిలిపోయాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌కు హాజరు కాని విద్యార్థులు రెండో విడత కౌన్సెలింగ్‌ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు, మొదటి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు మంచి కాలేజీలో సీటు సాధించేందుకు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని భావించారు. అయితే, అనూహ్యంగా సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మరోవైపు, కోర్టు తాజా ఉత్తర్వులు ఇంజినీరింగ్‌ కాలేజీలకు శరాఘాతంగా మారింది. 65 వేల సీట్లు ఖాళీగా మిగిలిపోవడంతో వారిపై పెనుభారం పడనుంది. జేఎన్టీయూహెచ్‌ అనుమతి నిరాకరించిన 174 కళాశాలల్లో ప్రవేశాలు నిలిచిపోయినట్లే! ఈ నేపథ్యంలో ఆయా కాలేజీల పరిస్థితి గందరగోళంలో పడింది.