మెదక్‌ ప్రచారం ముగిసింది

5
13న ఎన్నిక.. 16న ఫలితం

ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా

మెదక్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి) :

ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచార పర్వం గురువారంతో ముగిసింది. రేపు జరిగే ఎన్నిక ఫలితం ఈ నెల 16న విడుదల కానుంది. ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా తెలిపారు. ఎన్నిక కోసం ఎలక్షన్‌ కమిషన్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఉప ఎన్నికలో విజయం కోసం ప్రధాన పార్టీలు ¬రా¬రీగా పోరాడాయి. ప్రజలను ఆకర్షించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాయి. మొదటి నుంచి ప్రచారంలో ముందున్న టీఆర్‌ఎస్‌.. చివరి వరకు అదే దూకుడు ప్రదర్శించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేశారు. ఇద్దరు ముగ్గురు మంత్రులైతే వారం పది రోజులుగా ఇక్కడే మకాం వేసి ప్రచార బాధ్యతలను పర్యవేక్షించారు. మంత్రి హరీశ్‌రావు లోక్‌సభ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ పార్టీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమించారు. ఆయన తర్వాత మిగతా మంత్రులు రాజయ్య, కేటీఆర్‌, పోచారం శ్రీనివాసరెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇక, ప్రచార గడువు ముగియడానికి రోజు ముందు కేసీఆర్‌ కూడా ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్‌లో భారీ బహి  రంగ సభకు హాజరై ప్రజ లను ఆకర్షించారు. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రచా రానికి దూరంగా ఉంటారని వార్తలు వచ్చినా చివరకు ఆయన కూడా ప్రచారానికి వచ్చారు. బైక్‌ ర్యాలీలు, రోడ్‌షోలతో టీఆర్‌ఎస్‌ ప్రత్యర్థులకు అందకుండా ప్రచారంలో దూసుకుపోయింది. అధికార పార్టీకి దీటుగానే కాంగ్రెస్‌ కూడా ప్రచారం చేసింది. పార్టీ విజయం కోసం రాష్ట్ర ముఖ్య నేతలు అందరూ ప్రచారంలో పాల్గొన్నారు. పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత జానారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌, కేంద్ర మాజీ మంత్రులు జైపాల్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రులు దామోదర రాజనర్సింహా, షబ్బీర్‌ అలీ, జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, వీహెచ్‌, మాజీ ఎంపీలు వివేక్‌ తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ విమర్శలనుతిప్పికొడుతూ, ప్రజా సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ అధికార పార్టీగా దీటుగా ప్రచారం చేశారు. ప్రదానంగా వంద రోజుల పాలనలో వైఫల్యం, హావిూల అమలుపైనే కాంగ్రెస్‌ ప్రచారాస్త్రాలుగా ఉపయోగించింది. తొలుత ప్రచారంలో వెనుకబడిన కాంగ్రెస్‌ తర్వాత పుంజుకొంది. టీఆర్‌ఎస్‌కు దీటుగా నియోజకవర్గవ్యాప్తంగా ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభలతో ప్రజలను ఆకర్షించేందుకు యత్నించింది. గత ఎన్నికలలో ఎవరికి వారే తీరుగా వ్యవహరించిన నేతలు.. ఈ ఉప ఎన్నికలో మాత్రం సమష్టిగా కదిలారు. మరోవైపు, ప్రత్యర్థులకు దీటుగా బీజేపీ కూడా ఎన్నికల్లో పోరాడింది. టీడీపీ నేతలతో కలిసి బీజేపీ శక్తిమేరకు గెలుపు కోసం కృషి చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. బీజేపీ-టీడీపీ నేతలను సమన్వయం చేసుకుంటూ ప్రచారం నిర్వహించారు. అగ్ర నేతలు ఎవరూ రాకపోయినా పదునైన విమర్శలతో ఆకట్టుకొనే యత్నం చేశారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. చివరి రోజు కేంద్ర మంత్రులు సదానందగడౌడ, ప్రకాశ్‌ జగదేకర్‌లతో ప్రచారం చేయించి ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు కృషి చేశారు. సమైక్యవాదిగా, తెలంగాణ ద్రోహిగా ముద్రపడిన జగ్గారెడ్డిని చివరి నిమిషంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలోకి చేర్చుకొని టికెట్‌ ఇవ్వడంపై తొలుత విమర్శలు తలెత్తినా.. వాటిని అధిగమించి ఆ పార్టీ విజయం కోసం గట్టిగా పోరాడింది. అయితే, ఎవరి ప్రయత్నం ఫలిస్తుందో తేలాలంటే ఈ నెల 16 వరకు ఆగాల్సిందే!

ప్రలోభాల పర్వం షురూ..

ఎన్నికలో గెలుపు కోసం పార్టీలు ప్రలోభాల వల విసురుతున్నాయి. వారం రోజులుగా విమర్శలు, ప్రతివిమర్శలతో ¬రెత్తించిన నేతాగణం.. భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టిసారించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు రకరకాలుగా యత్నిస్తున్నారు. మద్యం, డబ్బు, నిత్యావసర వస్తువుల అందజేతతో ఓట్లు కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గురువారం రాత్రి నుంచే ప్రలోభాల వల మొదలైంది. క్షేత్రస్థాయిలో వివిధ పార్టీల నేతలు విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నట్లు తెలుస్తోంది. ప్రచారంతో ¬రెత్తించిన నేతలు.. ఇక ప్రలోభాలపై దృష్టి సారించారు. ఎన్నికలకు కేవలం ఒకేరోజు సమయం ఉండడంతో డబ్బు, మద్యం పంపిణీపై కసరత్తు చేపట్టారు.