‘బతుకమ్మ’ను ఘనంగా జరుపుదాం

1
రూ.10కోట్లు విడుదలచేసిన తెలంగాణ ప్రభుత్వం

ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) :

నూతన తెలంగాణ రాష్ట్రంలో తొలి బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించాలని సర్కార్‌ నిర్ణయించింది. ఇందుకు రూ.10కోట్లను విడుదలచేసింది. శుక్రవారం ఈ మేరకు సచివాలయంలో అధికారులతో సీఎం కేసీఆర్‌ సవిూక్షించారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాత వచ్చిన  మొట్టమొదటి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. బతుకమ్మ ఉత్సవాలకు మహిళాముఖ్యమంత్రులను, కేంద్రమంత్రులను ఆహ్వానించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు సీఎస్‌ రాజీవ్‌ శర్మ అధికారులు, నేతలతో సమావేశమయ్యారు. పండుగ నిర్వహణ తీరుపై వారితో సవిూక్ష చేపట్టారు. ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సమాచారశాఖ కమిషనర్‌ చంద్రవదన్‌, ఎంపీ జితేందర్‌రెడ్డి, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ నెలాఖరు నుంచి బతుకమ్మ పండుగలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 2 వరకు జరిగే దుర్గా నవరాత్రోత్సవాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. తెలంగాణ జాగృతి గత కొన్నేళ్లుగా బతుకమ్మకు బాగా ప్రాచుర్యం తీసుకుని వచ్చింది.