ఉప ఎన్నికకు సర్వం సిద్ధం : భన్వర్‌లాల్‌

4

15.45లక్షల ఓటర్లు, 1817 పోలింగ్‌ కేంద్రాలు, కట్టుదిట్టమైన భద్రత

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (జనంసాక్షి) :

మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గానికి, నందిగామ శాసనసభ నియోజకవర్గానికి శనివారం జరిగే ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల ప్రధా నాధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 15.5 లక్షల ఓటర్లున్నారని, 1817 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు రూ. కోటి నగదు, 5వేల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకు న్నామని ఆయన తెలిపారు. ఆయన విూడియాతో మాట్లాడుతూ పోలింగ్‌  ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉప ఎన్నికకు మొత్తం 1,837 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 15,43,700 ఓటర్లు న్నారని వెల్లడించారు.19కంపెనీల పారామిలటరీ బలగాలు, 5వేల మంది పోలీసులు, 11 వేల పోలింగ్‌ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని స్పష్టంచేశారు.జిల్లాలో గతంలో కంటే 15.45లక్షల ఓటర్లు, 1817 పోలింగ్‌ కేంద్రాలు, కట్టుదిట్టమైన భద్రత  ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశముందని తెలిపారు.

మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికకు శనివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. మొత్తం 1817 పోలింగ్‌ కేంద్రాల్లో 15.45 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాజీనామాతో మెదక్‌ లోక్‌సభకు ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉప ఎన్నిక కోసం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎన్నికల సరంజామాను సిబ్బందికి అప్పగించి, పోలింగ్‌ కేంద్రాలకు తరలించింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1817 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. తెలంగాణలో ఏకైక ఉప ఎన్నిక కావడంతో సుమారు తొమ్మిది వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తును ఏర్పాటు చేసింది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించిన పోలీసులు అక్కడ అదనపు బలగాలను మోహరించారు. ఉప ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌ బొజ్జా తెలిపారు. సిబ్బందికి శిక్షణ ఇచ్చి, ఎన్నికల సామగ్రి అందించామని వివరించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. కేంద్ర బలగాలను కూడా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఓటింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకున్నామని, 95శాతానికిపైగా ఓటింగ్‌ నమోదైన గ్రామాలు, పట్టణాలకు నజరానాలు అందించనున్నట్లు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల్లో వాటికి ప్రాధాన్యం ఇస్తామన్నారు.

చింతమడకలో ఓటేయనున్న కేసీఆర్‌

మెదక్‌ ఉప ఎన్నికలో ఓటుహక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆ పార్లమెంట్‌ పరిధిలోని సిద్దిపేట నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన చింతమడకకు వెళ్లనున్నారు. కేసీఆర్‌, ఆయన సతీమణి చింతమండకకు వెళ్లి ఓటు వేయనున్నట్లు సీఎం కార్యాలయ సీపీఆర్‌ఓ ఒక ప్రకటనలో తెలిపారు.

పకడ్బందీగా ఏర్పాట్లు : శనివారం నాటి మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లుచేసింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశామని కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రకటించారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ నిరోధానికి చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేకంగా బృందాలు నియమించి తనిఖీలు చేపడుతున్నారు. 21చోట్ల పికెట్లు ఏర్పాటుచేశారు. ఇతర ప్రాంతాల నుంచి బోగస్‌ ఓటర్లు జిల్లాలోకి రాకుండా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా ఇలా వారిని తరలించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకున్నామని ఎస్పీ శెముషి బాజ్‌పాయ్‌ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ఎన్నిక సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని ఎస్పీ చెప్పారు. జిల్లాలోని 2500మంది సిబ్బందికి అదనంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌ మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల నుంచి 4500మంది బందోబస్తు కోసం వచ్చారు. వీరికితోడు ఎనిమిది ప్లాటూన్ల సీఐఎస్‌ఎఫ్‌, 6 ప్లాటూన్ల సీఆర్‌పీఎఫ్‌, మూడు ప్లాటూన్ల టీఎస్‌ఎస్‌పీ బృందాలను రప్పించారు. మొత్తం 9వేల మందితో పక్కా నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. అయిదుగురు అదనపు ఎస్పీలు, 14మంది డీఎస్పీలు, 52 మంది సీఐల పర్యవేక్షణలో ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకున్నారు. ప్రతి బూత్‌కు కనీసం ఒక ¬ంగార్డు చొప్పున నియమించి ఓటర్లు వరుసలో వచ్చి ఓటుహక్కును వినియోగించుకునేలా చూస్తారు. ఇప్పటివరకు అక్రమంగా తరలిస్తున్న 743.81 లీటర్ల మద్యంతోపాటు రూ.75.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నిక పూర్తయ్యేవరకూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు అవసరమైన విధంగా సిబ్బందికి సూచనలు చేశారు. ప్రశాంత ఎన్నికకు ప్రతిఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేసారు.