జయశంకర్‌సార్‌కు పద్మవిభూషణ్
పీవీకి భారతరత్న
తెలంగాణ సర్కారు సిఫారస్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (జనంసాక్షి) :
దివంగత ఆచార్య జయశంకర్ సార్‌కు పద్మవిభూషణ్ పురస్కారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేయనుంది. అలాగే దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, ఆచార్య జి.రామిరెడ్డికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేయాలని సోమవారం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వీరితో పాటు పద్మశ్రీ అవార్డుకు జి.నర్సింగరావు, చిత్రలేఖన కళాకారుడు కాపు రాజయ్య పేర్లను కేంద్రానికి సిఫార్సు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన దస్త్రాన్ని సిద్ధంచేసింది. దీనికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు ఆమోదముద్ర లభించాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లోనే ఆయన ఆమోదం తెలపనున్నారు. ఆయన ఆమోదించగానే ప్రతిపాదనలను కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి బాట పట్టించిన పీవీకి భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేస్తామని బహిరంగ సభల్లోనూ ఆయన హావిూ ఇచ్చారు. తెలంగాణ నుంచి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన ఏకైక వ్యక్తి, తొలి తెలుగువాడైని పీవీకి భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల పీవీ జయంతి రోజున నిర్వహించిన సంస్మరణ సభలో కేసీఆర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోవైపు, తెలంగాణ జాతిపిత అయిన ప్రొపెసర్ జయశంకర్‌కు పద్మవిభూషణ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ఆశగా, శ్వాసగా బతికి, స్వరాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటంచేసిన ఆయనకు తగిన గౌరవం కల్పించేందుకు టీఆర్‌ఎస్ సర్కారు ప్రతిపాదనలు సిద్ధంచేసింది. మరోవైపు పద్మవిభూషణ్ పురస్కారానికి ప్రొఫెసర్ రామిరెడ్డి పేరును, పద్మశ్రీ అవార్డుకు ప్రభుత్వ రాజముద్ర రూపకర్త ఏలే లక్ష్మణ్, వైకుంఠం, కాపు రాజయ్య, ప్రొఫెసర్ నర్సింగరావు పేర్లను సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. వీరితోపాటు మరికొందరి పేర్లను సిఫార్సు చేయనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆమోదం లభించిన అనంతరం సిఫార్సులను కేంద్రానికి పంపించనున్నారు.