సంక్షేమ దిశగా సర్కారు

3

మూడు మంత్రివర్గ ఉప సంఘాలు ఏర్పాటు

రుణమాఫీ, రేషన్‌కార్డులు, సాగునీటి ప్రాజెక్టులపై కమిటీలు

హరీశ్‌, ఈటెల, పోచారం సారథ్యం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) :

సంక్షేమ కార్యక్రమాల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపై  మూడు మంత్రివర్గ ఉపసంఘాలను నియమించింది. రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టులు, రేషన్‌కార్డుల జారీ వంటి వాటిపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీలను ఏర్పాటుచేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో నలుగురు సభ్యులతో, రేషన్‌కార్డుల పంపిణీపై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో, సాగునీటి ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాలను ఏర్పాటుచేసింది. ప్రభుత్వ పథకాల అమలులో లోపాలను సవిూక్షించి, పారదర్శకత తీసుకొచ్చేందుకు వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రుణమాఫీ అమలుపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రుణమాఫీ అమలు కోసం నిర్వహిస్తున్న సామాజిక తనిఖీల్లో భారీగా అవకతవకలు వెలుగు చూసిన నేపథ్యంలో.. నిజానిజాలను వెలికితీసేందుకు ఈ కమిటీని నియమించారు. రుణమాఫీ అమలు కోసం అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎంత మంది రైతులు రుణాలు తీసుకున్నారు, అందులో ఎవరు అసలైన లబ్ధిదారులు ఉన్నారు, ఎంత మంది రుణమాఫీకి అర్హులు అనే దానిపై సామాజిక తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఒకే పాస్‌బుక్‌పై ఇద్దరు ముగ్గురు రుణాలు పొందడం, భూమి లేకున్నా రుణాలు తీసుకోవడం, తప్పుడు పత్రాలతో లోన్లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అక్రమాలను వెలికితీసేందుకు పోచారం నేతృత్వంలో క్యాబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటుచేసింది. మరోవైపు మంత్రి ఈటెల రాజేందర్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో మరో క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటుచేశారు. రేషన్‌ కార్డుల పంపిణీపై ఈ మంత్రివర్గ ఉపసంగం దృష్టిసారించనుంది. బోగస్‌ రేషన్‌కార్డుల తొలగింపు, కొత్త కార్డుల జారీ వంటి వాటిపై ఈ సబ్‌ కమిటీ మార్గదర్శకాలు రూపొందించనుంది. సమగ్ర సర్వే ఆధారిత రేషన్‌కార్డుల జారీపై ఈ కమిటీ దృష్టి సారించనుంది. మరోవైపు, సాగునీటి ప్రాజెక్టులు-ప్రాధాన్యాలపై మరో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేశారు. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ఉపసంఘాన్ని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సాగునీటి ప్రాజెక్టుల్లోని లోపాల సవిూక్ష కోసం క్యాబినెట్‌ సబ్‌కమిటీని ఏర్పాటుచేశారు. సాగునీటీ ప్రాజెక్టుల్లో లోపాలు, త్వరితగతిన పూర్తిచేసే ప్రాజెక్టులు వంటి వాటిపై ఈ కమిటీ మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించనుంది.