వాడిన కమలం

4

ఉప ఎన్నికల్లో బిజెపికి చుక్కెదురు

మోడీ వంద రోజుల పాలనపై షాక్‌

సిట్టింగ్‌ సీట్లను కోల్పోయిన కమల దళం

యూపీి, రాజస్థాన్‌లో భంగపాటు

గుజరాత్‌లో మూడు మైనస్‌

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) : ఉప ఎన్నికల్లో కమలం వాడిపో యింది. ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో బిజెపి కుదేలయింది. మంగళవారం వెలువడిన ఫలితాలు ఆ పార్టీకి నిరాశే మిగిల్చాయి. సిట్టింగ్‌ స్థానాలను సైతం కమలదళం కాపాడు కోలేకపోయింది. ఉత్తరప్రదేశ్‌, రాజ స్థాన్‌లోనూ భంగపాటు తప్పలేదు. గుజరాత్‌తో మూడు స్థానాలను కాం గ్రెస్‌కు జారవిడుచుకుంది.మోడీ వంద రోజుల పాలనపై ప్రజలు గట్టి షాక్‌ ఇచ్చారు.దేశవ్యాప్తంగాజరిగిన  ఉప ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ పట్టు నిలుపుకోగా.. గుజరాత్‌లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. ఒకే స్థానాన్ని కైవసం చేసుకొంది. ఈ నెల 13న 3 లోక్‌సభ, 10 రాష్టాల్ల్రోని 33 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించగా.. టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎస్పీ తలో చోట గెలుపొందాయి. మెదక్‌ లోక్‌సభ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గన విజయం సాధించారు. 3.60 లక్షల మెజార్టీతో గెలుపొందారు. గుజరాత్‌లోని వడోదరలో బీజేపీ విజయం సాధించింది. గతంలో ఇక్కడి నుంచి గెలుపొందిన ప్రధాని మోడీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే, ఇక్కడ బీజేపీకి మెజార్టీ గణనీయంగా తగ్గిపోయింది మోడీకి 5.80లక్షల మెజార్టీ రాగా.. ప్రస్తుత ఎన్నికలో 1.80లక్షల మెజార్టీ రావడం విశేషం. ఇక ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలో ఎస్పీ అభ్యర్థి తేజ్‌ప్రతాప్‌ సింగ్‌ విజయం సాధించారు. ఇక్కడ నుంచి గతంలో గెలుపొందిన ములాయంసింగ్‌ యాదవ్‌ రాజీనామాతో ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో కమల దళానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సొంతం చేసుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తేలిపోయింది. మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగగా.. తొమ్మిదింటిని ఎస్పీ కైవనం చేసుకుంది. బీజేపీ కేవలం నాలుగు స్థానాలకే పరిమితమైంది. చర్కారి, సీరాతు, బల్హా, రోహనియా, నిఘాశన్‌, బిజ్నోర్‌, హవిూర్‌పూర్‌, తకురవారాలలో సమాజ్‌వాదీ గెలుపొందింది. లక్నో (తూర్ప), సహ్రాన్‌పూర్‌, నోయిడా నియోజకవర్గాలను బీజేపీ దక్కించుకొంది. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ బోణి కొట్టింది. అసెంబ్లీలో ఒక స్థానం దక్కించుకొంది. పశ్చిమబెంగాల్‌లో రెండు అసెంబ్లీ సెగ్మెంట్‌లకు ఉప ఎన్నికలు నిర్వహించగా.. తృణమూల్‌ కాంగ్రెస్‌; బీజేపీ చెరో స్థానాలను గెలుచుకున్నాయి. రాజస్తాన్‌లో బీజేపీకి పరాభవమే మిగిలింది. నాలుగు చోట్ల ఎన్నికలు జరుగగా, బీజేపీ ఒక స్థానానికే పరిమితమైంది. నసిరాబాద్‌, వేర్‌, సురజ్‌గఢ్‌లను కాంగ్రెస్‌ కైవసం చేసుకోగా.. కోటా (దక్షిణం) నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సందీప్‌ శర్మ విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రాజస్తాన్‌లో క్లీన్‌స్వీప్‌ చేయగా.. ప్రస్తుతం ఎదురుదెబ్బ తగిలింది. అస్సాంలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఐదుచోట్ల ఎన్నికలు నిర్వహించగా.. బీజేపీ, కాంగ్రెస్‌, ఏఐయూడీఎఫ్‌, సీపీఎం, ఇండిపెండెంట్‌ తలో స్థానం దక్కించుకున్నారు. గుజరాత్‌లో మాత్రం బీజేపీ పట్టు నిలుపుకొంది. మొత్తం 9 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించగా.. ఆరింటిని కమలం కైవసం చేసుకుంది. మూడు చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు.