టీఆర్‌ఎస్‌ మార్కు పాలన

5

దసరా నుంచి సంక్షేమ పథకాల అమలు షురూ

వంద రోజుల్లో పనే చాలుగాలే

చంద్రబాబు మస్తు పైసలు పంపిండు

తెదెపాకు తెలంగాణలో నూకలు చెల్లినయి

ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి) :

దసరా నుంచి సంక్షేమ పథకాల అమలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఇక టీఆర్‌ఎస్‌ మార్కు పాలన మొదలవు తుందన్నారు. వంద రోజుల్లో ఇంకా పనే ఆరంభం కాలేదన్నారు. మెదక్‌ ఉప ఎన్నికలో చంద్రబాబు బాగా డబ్బు పంపించాడన్నారు. ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లినాయని స్పష్టం చేశారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, సీనియర్‌ నేత కేశవరావు, ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను వందకు వందశాతం అమలుచేస్తామని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. బంగారు తెలంగాణ కోసం అ¬రాత్రులు శ్రమిస్తామని తెలిపారు. ప్రజలు కోరుకుంటున్న బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిస్తామన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తొందరపడి ఏ పనిచేసినా భవిష్యత్తు తరాలు దెబ్బతింటాయన్నారు. టీఆర్‌ఎస్‌ మార్కు పాలన ఇంకా ప్రారంభం కాలేదని.. అది ప్రారంభమైతే ఇతర పార్టీలు తమ ముందు నిలబడవని చెప్పారు. ప్రతిపక్షాల నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానిస్తామని తెలిపారు. మెదక్‌ ఉప ఎన్నికలో అద్భుతమైన విజయం అందించిన మెదక్‌ జిల్లా ప్రజలకు హృదయపూర్వక దన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం విూద, టీఆర్‌ఎస్‌ విూద ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషిచేస్తుందని హావిూ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సారథి హరీశ్‌రావుకు, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం రాజయ్య, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు కేసీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల బలం, కృషి వల్లే గెలుపు సాధ్యమైందన్నారు. విపక్షాలది అనవసర రాద్దాంతం

ఈ ఎన్నికల్లో విపక్షాలు అతిగా వ్యవహరించాయని మండిపడ్డారు. ‘కొందరు అతిగా మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పొన్నాల సహా కొందరు అతిగా వ్యవహరించారు. పనికిమాలిన మాటలు మాట్లాడారు. ప్రభుత్వం అడుగు తీసి అడుగేస్తే తప్పు బట్టే ప్రచారం చేశారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన వారికి ప్రజలు తగిన బుద్ధిచెెప్పారని’ అన్నారు. టీడీపీతో జత కట్టినందుకు బీజేపీకి తగిన శాస్తి జరిగిందని అన్నారు. ప్రభుత్వం విపరీతంగా దుష్ప్రచారం చేసిన ఆ రెండు పార్టీలకు.. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు డిపాజిట్లు దక్కించుకున్నాయని తెలిపారు. ‘ప్రభుత్వం ఏర్పడి చాలా రోజులే కాలేదు. ప్రతి విషయంలో తప్పుబట్టే దిక్కుమాలిన ప్రయత్నం చేశారు. బాధ్యతలేకుండా వ్యవహరించారు. విపక్షాల దుష్పచ్రారాన్ని తిప్పికొట్టారు. సర్వే చేస్తామంటే బోగస్‌ ప్రచారం చేశారు. మంచి విద్య కోసం ఇంజినీరింగ్‌ కళాశాలలపై చర్యలు తీసుకొంటే తప్పుబట్టారు. పేకాట క్లబ్బులను రద్దు చేస్తే రాద్దాంతం చేశారు. చివరకు ఉప ఎన్నికల్లో పేకాట క్లబ్బులను ప్రచారం చేసుకొనేందుకు ఉపయోగించుకొన్నారు. గృహ నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశిస్తే తప్పుడు ప్రచారం చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొంటే తప్పుబట్టారు.. ప్రభుత్వాన్ని తప్పుబట్టిన ప్రతిపక్షాలకు ప్రజలు మాత్రం చావుదెబ్బ కొట్టిన్రు’ అని అన్నారు. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా వ్యవహరించండి.. బుద్ధి తెచ్చుకొని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండని విపక్షాలకు హితవు పలికారు. అంతే కానీ అనవసరమైన విషయాల్లో కోడిగుడ్డు విూద వెంట్రుకలు పీకే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ‘టీడీపీకి తెలంగాణలో స్థానంలోలేదని మరోసారి తేలిపోయింది. గెలుపు కోసం చంద్రబాబు విపరీతంగా డబ్బు పంపించారు. దొంగడబ్బు దొరికినా మళ్లీ పంపించారు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశారు. కానీ వారి ప్రయత్నాలు తిప్పికొట్టారు. టీడీపీకి నూకలు చెల్లిపోయినట్లేనని తాజా ఫలితం నిరూపిస్తోందని’ చెప్పారు.

హడావుడి నిర్ణయాలతో ఇబ్బందే

అధికారం ఉంది కదా అని హడావుడిగా నిర్ణయాలు తీసుకోలేమని కేసీఆర్‌ అన్నారు. ఇప్పుడు చేసే తప్పులు భవిష్యత్‌ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. ‘ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం మాకు మద్దతు తెలిపాయి. వారికి కృతజ్ఞతలు. వారిని నేను కోరేది ఒక్కటే.. కొంత తొందరపాటుగా ఏదో చేయాలని వారు ఆతృత పడుతున్నారు. వాస్తవం ఏందంటే.. తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం. ఈ రాష్టాన్రికి ఏమేం చట్టాలు కావాలి, ఏం చేయాల్సి ఉంది. లక్ష్యాలు, గమ్యాలు నిర్దేశించుకోవాల్సి ఉంది. ఇప్పుడు హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడు చేసే పొరపాటు భవిష్యత్‌ తరాలకు  దెబ్బ తగిలే పరిస్థితి ఏర్పడుతుంది. రెండ్రోజుల్లో 14వ ఆర్థిక సంఘం ప్రతినిధులు రానున్నారు. అన్ని అంశాలు పరిశీలించి వారికి ప్రతిపాదనలు ఇవ్వాలి. అడ్డదిడ్డంగా ఇవ్వలేం. ఇప్పుడు ఏం తప్పు చేసినా అదే అమలవుతూ ఉంటుందని’ అన్నారు. ఇంత కష్టపడి, త్యాగాలు చేసిన తర్వాత వచ్చిన తెలంగాణను నిర్మాణాత్మక అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సి ఉందన్నారు.

త్వరలోనే కేసీఆర్‌ మార్కు పాలన

రాష్ట్రంలో ఇంకా కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ మార్కు పరిపాలన ప్రారంభమే కాలేదని ముఖ్యమంత్రి చెప్పారు. అది ప్రారంభమైతే ఇతర పార్టీలు మా ముందు నిలబడలేవని చెప్పారు. ‘త్వరలోనే మా అజెండా ప్రారంభమైతది. ఉప ఎన్నికల్లో విజయంతో టీఆర్‌ఎస్‌ ప్రజలు మరింత బాధ్యత పెట్టారు. వందకు వంద శాతం ప్రజలకిచ్చిన హావిూలను అమలు చేసి తీరతాం. దసరా నుంచి పథకాలు ప్రారంభమవుతాయని’ చెప్పారు. ‘రైతుల రుణమాఫీ విషయంలోనూ విపక్ష నేతలు చాలా గోల్‌మాల్‌ చేసిన్రు. ఒకసారి మాట ఇచ్చాక వెనక్కిపోయే ప్రసక్తే లేదు. కచ్చితంగా అమలు చేస్తాం. అర్హత లేని వాళ్ల రేషన్‌కార్డులు తీసేస్తామన్నాం.. ప్రజలు ఆమోదించారు. గృహ నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డ వారి కట్టిస్తామన్నం.. ప్రజలు అంగీకారం తెలిపారని’ అన్నారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కూల్చివేస్తే ప్రతిపక్షాలు రాద్దాంతం చేశాయని మండిపడ్డారు. సర్వే పేరుతో రేషన్‌కార్డులు తొలగిస్తారని దుష్పచ్రారం చేశాయన్నారు. ‘అవును.. రేషన్‌కార్డులు తొలగిస్తాం. అనర్హులకు ఉన్న రేషన్‌కార్డులు రద్దు చేస్తాం. అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇచ్చి తీరతాం. ఇప్పుడు ఇచ్చే బియ్యం పెంచే ప్రయత్నం చేస్తాం.. అర్హులకు ఎట్టి పరిస్థితులకు అందజేస్తామన్నారు. రుణమాఫీ అమలు నేపథ్యంలో అనేక అవకతకలు వెలుగులోకి వస్తున్నాయని కేసీఆర్‌ చెప్పారు. భూమి లేకుండా రుణాలు తీసుకున్నారని, దొంగ పత్రాలతో రుణాలు పొందారని తెలిపారు. అక్రమార్కులకు లబ్ధి చేకూరకుండా స్వచ్ఛమైన రైతులకు వంద శాతం రుణమాఫీ అమలు చేస్తామన్నారు. వంద రోజుల పనితీరును ఏ విధంగా చూస్తారని విలేకరులు ప్రశ్నించగా.. అసలు నేను పనే చేయలేదని అన్నారు. ‘వంద రోజుల్లో ఏం చేస్తారు. 1845 రోజుల సమయం ఉంది. వంద రోజులు అని చెప్పేందుకు ఇదేం సినిమా కాదు.. సెన్సెక్స్‌ మార్కెట్‌ కాదు. టీఆర్‌ఎస్‌ మార్కు పాలన ఇంకా ప్రారంభం కాలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రోటీన్‌ ప్రభుత్వం కాదు. తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం.. పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మేం చాలా కష్టపడి 14ఏళ్లు పోరాడి తెలంగాణ తీసుకొచ్చాం. సాధరణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచాం. ఒకరోజు ఆలస్యమైనా ఫర్వాలేదు.. కానీ పకడ్బందీగా ముందుకు వెళ్తామని’ అన్నారు. గత ప్రభుత్వాలు ఆరేళ్ల నుంచి రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదని, తాము అధికారంలోకి రాగానే ఇచ్చామన్నారు. ఎర్రజొన్న రైతుల బకాయిలు రూ.11కోట్లు మంజూరు చేశామని తెలిపారు. త్వరలోనే కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేస్తామన్నారు. ‘తెల్లారెటకల్లా ఇది రాదు.. అది చాలా పెద్ద అంశం. దీనిపై చాన్సలర్లు, లెక్చరర్లు, టీచర్లు, మేధావులతో త్వరలో సదస్సులు నిర్వహించనున్నామని’ చెప్పారు.

బంగారు తెలంగాణ దిశగా..

శాసనసభ సమావేశాలు నిర్వహించాలన్న విపక్షాల డిమాండ్‌పై కేసీఆర్‌ స్పందించారు. ‘శాసనసభ సమావేశాలు పెట్టాలని మాకు తెలియదా? ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు సమర్పించిన తర్వాత బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని భావించాం, అందుకే కొంత ఆలస్యమైంది. అయినా విభజన చట్టం ద్వారా డిసెంబర్‌ 2 దాకా బడ్జెట్‌ ఆమోదించేందుకు మాకు వెసులుబాటు ఉంది. ఆ లోపు బడ్జెట్‌ పాస్‌ కావాలి’ అని అన్నారు. ప్రజలు కలగంటున్న బంగారు తెలంగాణ సాధించేందుకు అ¬రాత్రాలు శ్రమిస్తామని తెలిపారు. ప్రణాళికలు సిద్దమయ్యాయి, పక్షం రోజుల్లో ఒక్కొక్కటి అమలవుతాయన్నారు. మూడు నెలల నుంచి మేం ఏం చేశామో వాటిని ప్రజలు ఆమోదించారని చెప్పారు. గోబెల్స్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని తెలిపారు. కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు పెద్దవాళ్లను తిడితే మేం కూడా పెద్దవాళ్లమవుతామని విమర్శలు చేశారని మండిపడ్డారు. విూడియా కూడా కొంత తప్పుదోవ పట్టించినా.. ప్రజలు తమ విశ్వాసాన్ని చాటుకున్నారని చెప్పారు. బీజేపీ మూడో స్థానంలో నిలవడం నైతిక విజయమా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. దేశంలో ఏ పార్టీకి కనబడని ఆదరణ టీఆర్‌ఎస్‌కు లభించిందన్నారు. గతంలో వడోదరలో మోడీకి 5 లక్షల మెజార్టీ వస్తే.. ఇప్పుడు 1.80 లక్షలకు పరిమితమైందన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం మాదే

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వంద శాతం విజయం సాధిస్తుందని కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ను మురికివాడలేని నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఫుట్‌పాత్‌లపై పడుకొనే పేదలకు నివాసాలు కల్పిస్తామన్నారు. ‘ఇళ్లు కూల్చే ఉద్దేశ్యం మాది కాదు.. ఆ రాక్షాసానందం మాకు లేదు.. అక్రమాలను నియంత్రించాలన్నదే మా ఉద్దేశ్యం’ అని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్వాకం వల్లే హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయని విమర్శించారు. 4లక్షల ఇళ్లు అక్రమంగా నిర్మించినట్లు లెక్కలు చెబుతున్నాయి తెలిపారు. ఎంత ఘోరమైన పరిపాలన ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. దీన్ని త్వరలోనే సరి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తన్నామన్నారు. జంట నగరాల్లో ఉన్న ప్రతి పేదవారికి ఇల్లు కట్టించి ఇస్తామని, ఫుట్‌పాత్‌లపై పడుకొనే వారికి ఆవాసం కల్పిస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన మంచిని స్వీకరిస్తామని కేసీఆర్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘మంచిని స్వీకరించలేనంత గుడ్డిగా మేం లేము.. మంచి జరిగి ఉంటే స్వీకరిస్తాం.. చెడు జరిగితే తొలగిస్తాం’ అని అన్నారు. అన్ని రాష్టాల్రను సమానంగా చూస్తామని ప్రధాని మోడీ హావిూ ఇచ్చారన్నారు. తెలంగాణకు సంపూర్న సహకారం ఉంటుందని తెలిపారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మాఎడల మంచిగా వ్యవహరిస్తుందని నమ్ముతున్నామన్నారు. ఈ నెలాఖరులో పార్టీ ప్లీనరీ ఉంటుందని కేసీఆర్‌ తెలిపారు. 20 వేల మందితో ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. రెండు మూడ్రోజుల్లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై తేదీలు ప్రకటిస్తామని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించగా.. తేదీ చెప్పేందుకు ఆయన నిరాకరించారు.