కొత్త రాష్ట్ర అవసరాలకనుగుణంగానే విధానాలు

2

14వ ఆర్థిక సంఘం పర్యటన నేపథ్యంలో సీఎం సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) :

కొత్త రాష్ట్ర అవసరాలకు అనుగుణంగానే విధానాలు రూపొందించాలని అధికారులతో సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన 14వ ఆర్థిక సభ్యులు రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వారితో జరిగే సమావేశంలో ఎలాంటి ప్రతిపాదనలు అందించాలనే విషయంపై అధికారు లతో ముఖ్యమంత్రి బుధవారం సన్నాహక సమావేశం నిర్వ హించారు. తెలంగాణ రాష్ట్రం అవసరాలు, ప్రాధాన్యాలకు అనుగుణంగా తాము విధానాలు, పథకాలు, ప్రణాళికలు రూపొందించుకుంటున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. వీటికి అనునగుణంగానే కేంద్రం నుంచి నిధులను కోరాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రతి శాఖ ఆధ్వర్యంలో ఏయే పథకాలు ప్రవేశపెడుతున్నాం, వాటికి ఎలాంటి విధానాలు రూపొందిస్తున్నాం అనే విషయాలను ఆర్థిక సంఘానికి స్పష్టంగా చెప్పాలని ముఖ్యమంత్రి కోరారు. మన ఊరు మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే, చెరువుల పునరుద్ధరణ, హైదరాబాద్‌ సేఫ్‌ అండ్‌ స్మార్ట్‌ సిటీ, గిరిజన సంక్షేమం డ్రింకింగ్‌ వాటర్‌ గ్రిడ్‌, తెలంగాణకు హరిత హారం లాంటి వినూత్న కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్న విషయాన్ని కేంద్రానికి చెప్పాలని, సహకారం కోరాలని సీఎం చెప్పారు. మన మూరు మన ప్రణాళిక ద్వారా గ్రామంలో ప్రతి వ్యక్తి ఎలాంటి అవసరాలను కోరుకుంటున్నాడో, గ్రామానికి ఏమి కావాలి అనే విషయంలో స్పష్టత వచ్చిందన్నారు. వీటికి అనుగుణంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని, ఆర్థిక సంఘం కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయింపు జరపాలని ప్రభుత్వం తరపున కోరనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వాలు నీరుమీరు లాంటి నిరుపయోగమైన కార్యక్రమాలు అమలుచేశాయని, వీటివల్ల నిధులు ఖర్చవడం తప్ప ఫలితం రాలేదన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అటు చెరువులను పునరుద్ధరించడం, ఇటు హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పారు. వాతావరణ సమతుల్యాన్ని కాపాడడానికి, భూగర్భ జలాలను పెంచడానికి చేస్తున్న కార్యక్రమాలను ఆర్థిక సంఘానికి చెప్పాలన్నారు. హైదరాబాద్‌కు కృష్ణా నీటిని తరలించడానికి కూడా ప్రణాళిక సిద్ధంగా ఉందని, తెలంగాణకు అత్యవసరమైన పాలమూరు, పాకాల-జూరాల ప్రాజెక్టు కడుతున్నామని కూడా చెప్పాలన్నారు. వీటి వల్ల కలిగే లాభాలు సవివరంగా చెప్పడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవను, చిత్తశుద్ధిని అర్థం చేసుకుందని సీఎం అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచినీటి పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని, కేంద్ర ప్రభుత్వం కూడా మంచినీటి అవసరాలు తీర్చే విధనాలకు మద్దతుగా ఉంటుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. అందుకే దాదాపు 25వేల కోట్ల రూపాయల వ్యయంతో అమలుచేస్తున్న తెలంగాణ వాటర్‌ గ్రిడ్‌ కార్యక్రమం గురించి ఆర్థిక సంఘానికి చెప్పాలని సీఎం అన్నారు. పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేయడానికి, సింగపూర్‌ తరహాలో నైబర్‌హుడ్‌ పోలీసింగ్‌ విధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న విషయాలను కూడా వివరించాలన్నారు. హైదరాబాద్‌లో అత్యున్నత ప్రమాణాలతో చేపట్టబోయే రోడ్ల నిర్మాణం, ఉద్యమ స్ఫూర్తితో సాగే అడవుల రక్షణ లాంటి వినూత్న కార్యక్రమాలను కూడా వివరించాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, ప్రభుత్వ సలహాదారులు పాపారావు, జిఆర్‌.రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు, వివిధ శాఖల కార్యదర్శులు బిజి.ఆచార్య, నాగిరెడ్డి, రాధ, జోషి, రేమాండ్‌ పీటర్‌, డిజిపి అనురాగ్‌ శర్మ, నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.