రుణమాఫీపై మంత్రివర్గ ఉపసంఘం:మంత్రి పోచారం

3

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) :

వ్యవసాయ రుణమాఫీపై విధివిధానాలను ఖరారు చేసేందుకు ఏడుగురు మంత్రులతో తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఈ కమిటీలో మంత్రులు ఈటెల రాజేందర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌, జగదీశ్వర్‌రెడ్డి, జోగు రామన్న, మహేందర్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ నెల 20కల్లా రుణమాఫీ విధివిధానాలపై మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఇవ్వనుంది. పంటల రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం కేసీఆర్‌ మంగళవారం పునరుద్ఘాటించారు. రుణమాఫీకి బ్యాంకర్లు సహకరించకుంటే రైతలుకు నేరుగా బాండ్లు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతుల రుణమాఫీపై రెండుమూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇప్పటికే జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు సేకరించామని తెలిపారు. ఆర్‌బీఐ నిబంధనల వల్ల రీషెడ్యూల్‌లో సమస్యలు వచ్చాయన్నారు. మంత్రివర్గ ఉపసంఘం గురు,శుక్రవారాల్లో సమావేశమై చర్చిస్తుందని చెప్పారు.  ఇజ్రాయెల్‌ అధికారులు తనను కలిశారని మంత్రి తెలిపారు. త్వరలోనే ఇజ్రాయెల్‌ వెళ్లి అక్కడి సాగు, దిగుబడిపై అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ ఇచ్చే అంశంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మంత్రివర్గ ఉపసంఘంఛైర్మన్‌గా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కన్వీనర్‌గా వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్యతలు నిర్వహించనున్నారు. సభ్యులు.. మంత్రులు హరీష్‌రావు, ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి, జోగు రామన్న, మహేందర్‌రెడ్డి. రైతుల రుణమాఫీపై ఈ నెల 20లోగా నివేదిక ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘానికి ప్రభుత్వం     ఆదేశాలు జారీచేసింది.  ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్రంలో చెరువులను పునరుద్దరిస్తామని, గొలుసుకట్టు చెరువులకు ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్‌ హావిూనిచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణపై మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపసంఘం ఛైర్మన్‌గా నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, కన్వీనర్‌గా నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్యతలు నిర్వహించనున్నారు. సభ్యులుగా కేటీఆర్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్‌, జోగురామన్న, మహేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి కొనసాగనున్నారు. చెరువుల పునరుద్ధరణపై ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వాలని ఉపసంఘానికి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.