అమ్మా ఆశీర్వదించు : ప్రధాని నరేంద్రమోడీ

4

గాంధీనగర్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) :

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన పుట్టిన రోజు సందర్భంగా బుధవారం తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ 64వ వసంతంలోకి అడుగుపెట్టారు. జన్మదినం సందర్భంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌ వెళ్లి తల్లి హీరాబెన్‌ వద్ద మోడీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి ప్రత్యేకంగా తయారుచేయించిన మిఠాయి తిన్నారు. ఆమె కొడుకును ఆప్యాయంగా ముద్దాడి ఆశీర్వదించారు. మోడీని ఆశీర్వదించి తల్లి ఆయనకు రూ. 5వేలు కానుకగా ఇచ్చారు. మోడీ ఆ డబ్బును ప్రధానమంత్రి సహాయ నిధికి అందజేశారు. దీనిని కాశ్మీర్‌ బాధితులకు అందచేస్తారు. తన జన్మదినోత్సవాన్ని జరుపుకోవద్దని ఇప్పటికే ఆదేశించారు. కాశ్మీర్‌ వరదల కారణంగా తాను ఇలాంటి వాటికి దూరంగా ఉన్నానని అన్నారు. ఇదిలావుంటే ప్రధానిని గుజరాత్‌ సీఎం ఆనందీబెన్‌, గవర్నర్‌ కోహ్లీలు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిని అందించినందుకు హీరాబెన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలావుంటే మహిళల స్వావలంబనకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. దుర్భర దారిద్రయంలో మగ్గుతున్న పేద ప్రజానీకానికి మంచి జీవితం అందించేందుకు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. బుధవారం గాంధీనగర్‌లో స్వావలంబన అభియాన్‌ కార్యక్రమం జరిగింది. యువకులు, మహిళలు, కార్మికులు, చేతిపనివారికి స్వావలంబన కల్పించే దిశగా 11పథకాలను ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. ఈ పథకం కింద పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా పాలయంత్రాలు, పశుదాణ కోసే మిషన్లు అందజేయనున్నారు. అలాగే డైరీల నిర్వాహణకు భూములను కేటాయించనున్నారు. కంప్యూటర్‌ కోర్సులు పూర్తి చేసిన ఐటీఐ విద్యార్థులకు టేబ్లాయిడ్‌ కంప్యూటర్లు పంపిణీ చేయనున్నారు. నిర్మాణ పనివారి కోసం గృహ నిర్మాణాలు చేపట్టనున్నారు. స్వయం సమృద్ధి లో గుజరాత్‌ అందరికీ ఆదర్శంగా ఉందని మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు.