9నుంచి టెన్త్‌ మూల్యాంకనం

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి): పదో తరగతి పరీక్షలు ముగియడంతో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి విద్యాశాఖ విస్తృతంగా  ఏర్పాట్లు చేసింది. ఈనెల 9 నుంచి జిల్లా కేంద్రంలోని కాన్వెంట్‌ హైస్కూల్‌లో మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఇందుకోసం 2300 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. వీరంతా మూల్యాంకనంలో నిమగ్నం కానున్నారు. ఈనెల 22 వరకు ఈ పక్రియ కొనసాగనుందని డిఇవో తెలిపారు.  మే మొదటివారంలోగా పరీక్షా ఫలితాలు వెలువడేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. గతనెల మార్చి 21 నుంచి పరీక్షలు ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు సోమవారం  సాంఘికశాస్త్రం పేపర్‌-2 పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు 37,967 మందికి 37,760 మంది హాజరయ్యారు. ఆఖరు రోజున ఎలాంటి మాల్‌ప్రాక్టిసు కేసులు నమోదు కాలేదు. . పది మంది విద్యార్థులపై మాల్‌ప్రాక్టిస్‌ కేసులు మినహాయిస్తే జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 203 పరీక్షాకేంద్రాల్లో పరీక్షలుప్రశాంతంగా ముగియడంతో అటు పిల్లలు, వారి తల్లిదండ్రులు ఇటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.