90శాతం మిర్చి తుడిచిపెట్టుకు పోయింది
ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు
తక్షణమే ఆదుకోవాలని ప్రబుత్వానికి డిమాండ్
గుంటూరు,ఫిబ్రవరి24(జనం సాక్షి): గుంటూరు జిల్లాల్లో 2.55 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తే, తామర తెగులు వల్ల 90 శాతం పంట తుడిచిపెట్టుకొని పోయిందని రైతు సంఘాల నేతలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి రైతులకు నష్టపరిహారం, బీమా వెంటనే అందజేయాలని వారు డిమాండ్ చేశారు. గత డిసెంబర్ 22న గుంటూరులో జరిగిన సవిూక్షలో రైతులను ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, హోం మంత్రి సుచరిత హావిూ ఇచ్చి, రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా అందలేదన్నారు. రైతుల తరుఫున పంటల బీమాను తామే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూని విస్మరించడం వల్ల రైతులకు వాతావరణ బీమా సదుపాయం అందలేదని తెలిపారు. తామర తెగులు వల్ల తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి, పత్తి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇదిలావుంటే సమస్యను ప్రబుత్వం దృష్టికి తీసుకుని వచ్చే క్రమంలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో దీక్ష చేపట్టారు. మిర్చి టాస్స్‌ఫోర్స్ చైర్మన్‌గా ఉన్న బిజెపి రాజ్యసభ సభ్యులు జివిఎల్.నరసింహారావు గుంటూరు జిల్లాలో
అత్యధికంగా నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పిఎం కేర్స్ ఫండ్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం మిర్చి రైతులకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు సహాయం అందించడం కోసం నిధులు తెచ్చుకోవడానికి అవసరమైతే కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలని సూచించారు. పల్నాడు ప్రాంతంలో పూర్తి స్థాయిలో మిర్చి రైతులు నష్టపోవడంతో గతంలో మాదిరిగా సామాజిక సంక్షోభం ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని రైతుల తరుఫున నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. మంత్రులు, ఉన్నతాధికారులు గ్రామాల్లో తిరిగి ప్రత్యక్షంగా మిర్చి పైరును పరిశీలించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పటికీ రైతులను దివాలా తీయించే ప్రయత్నాలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. వ్యవసాయ రంగానికి బ్జడెట్‌లో నిధులను గణనీయంగా తగ్గించిందని తెలిపారు. ఎరువులపై సబ్సిడీలను
తగ్గించడంతో వాటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. ఎఫ్‌సిఐ ద్వారా ధాన్యం కొనుగోలు భారీగా తగ్గించడంతో రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని తెలిపారు.