93 శాతం పోలింగ్‌

– త్రిపురలో సరికొత్త రికార్డు
అగర్తలా, (జనంసాక్షి) :
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈశాన్య రాష్ట్రంలో ఓటర్లు వెల్లువలా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. 93 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. గురువారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. దీంతో మధ్యాహ్నానికే 40 శాతానికి పైగా ఓటింగ్‌ నమోదైంది. 60 నియోజకవర్గాలకు గాను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3,041 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ముఖ్యమంత్రి మణి సర్కార్‌ రామ్‌నగర్‌ నియోజకవర్గంలోని ఉమకాంత స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ అంతా సవ్యంగా సాగినప్పటికీ, అక్కడక్కడ ఇబ్బందులు తప్పలేదు. ఈవీఎంలలో సాంకేతిక కారణాల వల్ల వెస్ట్‌ త్రిపురలోని సోనమురాలో ఓటింగ్‌ నిలిచిపోయింది. మరోవైపు, దిక్షణ త్రిపురలోని ధర్మానగర్‌లో కూడా పోలింగ్‌కు బ్రేక్‌ పడింది. వాటి స్థానంలో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేసి, ఓటింగ్‌ నిర్వహించారు. దీంతో పోలింగ్‌ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. రాష్ట్రవ్యాప్తంగా 23.52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఈసీ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. మొత్తం 250 కంపెనీల బలగాలు ఎన్నికల విధుల్లో పాలుపంచుకున్నాయి. 60 శాసనసభ స్థానాలకు గాను 249 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 16 పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ వామపక్ష కూటమి-కాంగ్రెస్‌ కూటముల మధ్య నెలకొంది. వామపక్ష కూటమిలోని సీపీఎం 55 స్థానాల్లో ఆర్‌ఎస్పీ రెండు, సీపీఐ రెండు, ఫార్వార్డ్‌ బ్లాక్‌ ఒక స్థానం బరిలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో గెలిచి వామపక్ష కూటమి రికార్డు స్థాయిలో ఐదోసారి అధికారం చేపట్టాలని ఆశలు పెట్టుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 48 స్థానాల నుంచి, మిత్రపక్షాలు మిగతా చోట్ల నుంచి బరిలోకి దిగాయి. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్‌ కూటమి ఆశలు పెట్టుకుంది.