గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వాహనంలో 15మంది ప్రయాణిస్తున్నారు. వీరంతా డెకరేషన్ చేసే పనివాళ్లు. వాహనంలో వారందరికీ గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కాకాని పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి నిద్రమత్తు కారణమా? మరేమైనా కారణమా? మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు