మరో భారీ ఎన్ కౌంటర్

కొత్తగూడెం : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ. మొన్న చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతిచెందగా.. తాజాగా కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని అడవుల్లో పోలీసులు, మామావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో సుక్మా జిల్లా లచ్చన్న దళానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. ఎన్‌కౌంటర్‌ ప్రదేశంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. గాయపడిన పోలీసులకు మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మావోయిస్టు మృతదేహాలను జండా గుట్ట నుంచి కిందికి తరలించారు. ఓ కానిస్టేబుల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. మృతుల్లో కుంజా వీరయ్య, అలియాస్‌ లచ్చన్న సుఖమా జిల్లా, పూణేం లక్మా , బీజాపూర్‌, కోవసి రాము, ఎటపాక ఆంధ్ర ప్రదేశ్‌, పోడియం కోసయ్య, కొంటావా చర్ల మండలం (భద్రాద్రి కొత్తగూడెం), కోసి, నీల్వాయు, దుర్గేష్‌ నీల్వాయి ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజ్‌ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మావోయిస్టుల మృతదేహాలు రఘునాథపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని బోడగుట్ట ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం. క్యాంప్‌ వేసుకుని ఉన్న క్రమంలో గ్రేహౌండ్స్‌ పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినట్టు తెలిసింది.