అందాల పోటీలు అవసరమా?
విందులు, వినోదాల కోసమే నిర్వహించారు.
` కార్యక్రమం కోసం అనవసరంగా రూ.200కోట్లు ఖర్చు పెట్టారు: హరీశ్‌రావు
సిద్దిపేట(జనంసాక్షి):జగదేవ్‌పూర్ మండలం తీగుల్‌లో ఏర్పాటు చేసిన భారాస కార్యాలయాన్ని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రారంభించారు. కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘’అందాల పోటీలకు రూ.200కోట్లు ఖర్చు పెట్టారు. అనుచితంగా ప్రవర్తించినట్టు మిస్ ఇంగ్లాండ్ ఆరోపించారు. విందులు, వినోదాల కోసమే అందాల పోటీలు పెట్టారు. ఆ పోటీల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు మాత్రమే. మూసీ పునరుద్ధరణ, హైడ్రా అని అన్నీ వదిలేశారు. రాజీవ్ యువశక్తి పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలకే లబ్ధి చేకూరుతుంది. ఉద్యమ సమయంలో ఎంతో స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు. ఇదేనా రేవంత్‌రెడ్డి తెచ్చిన మార్పు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు. రైతు బంధు, కల్యాణ లక్ష్మి, జిల్లాకో మెడికల్ కాలేజీ ఇచ్చారు.. రద్దు చేస్తారా? అద్భుతమైన సచివాలయం కట్టారు అది తీసేస్తారా? 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. అది తొలగిస్తారా? దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పిన వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి’’ అని హరీశ్‌రావు విమర్శించారు.