విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణ ఎంతో ముఖ్యం తహసీల్దార్ దత్తాద్రి

అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొదుపు
ఎడపల్లి, జనవరి 3 ( జనంసాక్షి ) : విద్యార్థి దశ నుండే విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని తద్వారా భవిష్యత్తులో పొదుపుపై పూర్తి అవగాహన కలుగుతుందని ఎడపల్లి మండల తహసీల్దార్ దత్తాద్రి స్పష్టం చేశారు. శనివారం ఎడపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిధుల మంజూరులో భాగంగా రోజుకు ఒక్క రూపాయి మనకోసం మన పాఠశాల కోసం అనే నినాదంతో విద్యార్థుల నుండి రోజుకు ఒక్క రూపాయి సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుని మూడు నెలల తర్వాత విద్యార్థులు అందించిన సహాయంకు మూడు రెట్లు అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎడపల్లి మండల తహసీల్దార్ దత్తాద్రి మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధి కోసం అభయ ఫౌండేషన్ ఇప్పటికే ఎన్నో పనులు చేపట్టడం జరిగిందని అయితే ఈసారి విద్యార్థులను సైతం భాగస్వాములు చేసి వారికి పొదుపుపై అవగాహన కల్పించడంతోపాటు ఆర్థిక క్రమశిక్షణ నేర్పించే విధంగా వారి వెన్నంటే ఉండడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు ఆర్థిక క్రమశిక్షణ ఎంతో ముఖ్యమని తద్వారా మునుముందు ఆర్థిక అంశాలపై మంచి పట్టు సాధిస్తారని ఆయన స్పష్టం చేశారు. అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమ పూర్తి సహకారాలు అందించడం గర్వకారణమని ఇదే స్ఫూర్తిని మునుముందు సైతం కొనసాగించాలని తహసీల్దార్ దత్తాద్రి కోరారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి సర్పంచ్ కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ మచ్కూరి గంగాధర్, జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్, ఎడపల్లి మండల విద్యాశాఖ అధికారి గాలప్ప, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గంగా శంకర్, గ్రామ పెద్దలు న్యావనంది గోపాల్, బంజ శంకర్, మల్లెపూల శ్రీనివాస్, రాజు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


