వాహ‌న‌దారుల‌కు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన!

వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫాస్టాగ్‌  విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్‌ హైవేలపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కొత్త ఫాస్టాగ్‌ పాలసీని తీసుకొచ్చింది. అన్ని రహదారులపై ప్రతిసారీ టోల్‌ట్యాక్స్‌ చెల్లించాల్సిన పనిలేకుండా ఒకేసారి ఏడాదికి చెల్లించేలా ఫాస్టాగ్‌ ఆధారిత వార్షిక పాస్‌ను తీసుకొచ్చింది. ఈ పాస్‌ ద్వారా వాహనదారులు రూ.3వేలు చెల్లించి ఏడాదంతా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ప్రయాణించొచ్చు.ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ  బుధవారం ఎక్స్‌లో పంచుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ వార్షిక పాస్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. యాక్టివేట్‌ చేసిన పాస్‌లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు (ఏది ముందైతే అది) చెల్లుబాటు అవుతాయని వెల్లడించారు. కార్లు, వ్యాన్లు వంటి నాన్‌ కమర్షియల్‌ వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఈ పాస్ యాక్టివేషన్‌ కోసం త్వరలోనే లింక్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. రాజ్‌మార్గ్‌ యాప్‌తోపాటు  వెబ్‌సైట్లలో ఈ లింగ్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.