H-1B వీసాలపై టెన్షన్ వద్దు
ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. హెచ్-1బీ వీసాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తాజాగా ప్రకటించారు. H-1B వీసాల గడువు పొడిగింపుపై ఎలాంటి సవరణలు చేయడం లేదన్నారు. అలాంటి ఆలోచనేమీ తమకు లేదని సోమవారం స్పష్టంచేశారు.హెచ్-1బీ వీసా పరిమితిని ఆరేళ్లకు మించి పొడిగించేలా అనుమతిచ్చే సెక్షన్ 104 (సీ)కి మార్పులు చేసి.. ఆ వీసాదారులను అమెరికా విడిచి వెళ్లేలా చేసే ఉద్దేశం తమకు లేదన్నారు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) మీడియా రిలేషన్స్ చీఫ్ జోనాథన్ వితింగ్టన్. ఒకవేళ అలా చేసినా వచ్చిన నష్టం లేదని.. ఎందుకంటే సెక్షన్ 106(ఎ)-(బీ) కింద ఎంప్లాయర్స్ ఏడాది చొప్పున పరిమితిని పెంచుకుంటే వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. అధ్యక్షుడు జారీ చేసిన బయ్ అమెరికన్ హైర్ అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమలు చేసేందుకు కొన్ని విధానపరమైన మార్పులు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే పరిమితి పూర్తయి.. గ్రీన్‌కార్డుల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది ఇండియన్స్‌కు ఇది కచ్చితంగా ఊరట కలిగించే విషయమే అంటోంది ఇమ్మిగ్రేషన్ వాయిస్ గ్రూప్. ఈ ప్రకటనకు ముందే తాము విజయం సాధించినట్లు తమ ఫేస్‌బుక్ పేజీలో ప్రకటించింది. హెచ్-1బీకి సంబంధించి USCIS తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఈ గ్రూప్ స్పష్టంచేసింది.