రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరు హక్కులు,బాధ్యతలు, పదవులను పొందుతున్నారు,కలెక్టర్ : త్రిపాఠి

నల్గొండ బ్యూరో (జనంసాక్షి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు,బాధ్యతలను,పదవులను పొందగలుగుతున్నారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్134 వ జయంతి ని పురస్కరించుకొని సోమవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం డిఈఓ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఉంటూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించిన ఆర్టికల్స్ వల్లనే తాను ఐఏఎస్ కాగలిగానని,అదేవిధంగా భవిష్యత్తులో ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే విద్యార్థులకు ఆయన రాజ్యాంగమే స్ఫూర్తి ఆని అన్నారు.సమాన విద్య,సమానత్వ హక్కులు, ప్రాథమిక హక్కులన్నీ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసినవే అని తెలిపారు.దేశంలో,ప్రపంచంలో ఎటువైపు చూసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మార్కు కనిపిస్తుందన్నారు.ఎలాంటి పక్షపాతం లేకుండా డ్రాప్టింగ్ కమిటీని రూపొందించడమే కాకుండా,ప్రాథమిక హక్కులు, సూత్రాలను రాజ్యాంగంలో ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని 1950,జనవరి 26 నుండి పూర్ణ రూపుకు తీసుకువచ్చారని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్ ను ఈరోజు నుండే అమలులోకి తీసుకురానుందని,రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఈ రోజే భూభారతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారని,ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజని అన్నారు.మూఢనమ్మకాలను పక్కనపెట్టి, ప్రతి మాటకు శాస్త్రీయత ఉండే విధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని,దాని ప్రకారమే మనందరం ముందుకెళ్తున్నామని అన్నారు.విద్యార్థులు శ్రద్ధతో చదివి,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను స్పూర్తిగా తీసుకొని వారి ఆశయ సాధన కృషి చేయాలన్నారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ చదువును ఆయుధంగా తీసుకొని సామాజిక మార్పును తీసుకొచ్చిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.ఇతర దేశాలకు వెళ్లి చదువుకొని విజ్ఞానాన్ని సంపాదించి మన దేశ పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు వెళ్లాలో కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆనాడే రాజ్యాంగంలోపొందుపరిచారన్నారు. సమానత్వం,సామాజిక న్యాయం తో పాటు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, ఆయన విలువల ఆధారంగానే మనం ముందుకు వెళ్తున్నామని అన్నారు.శాసన మండలి సభ్యులు నెల్లికంటి సత్యం మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం హక్కులు, చట్టాలను రూపొందించి భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు.నిమ్న కులం లో పుట్టి ఎన్నో అవమానాలకు గురై,చదువు నేర్చుకుని ప్రపంచ మేధావిగా నిలబడ్డారన్నారు.ప్రపంచంలోనే అనేక రాజ్యాంగాలను చదివి దేశ రాజ్యాంగాన్ని రచించారని,ఎస్సీ, ఎస్టీ,బీసీ హక్కులను రూపొందించడం కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు.అలాంటి ప్రపంచ మేధావి మన దేశంలో పుట్టడం అందరికీ గర్వకారణమని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్పూర్తిగా సమానత్వం కోసం ప్రజాతంత్ర శక్తులందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అని పిలుపునిచ్చారు.అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రమేష్,ఇన్చార్జి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్,జెడ్పిసిఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్,బీసీ సంఘ నాయకులు చక్రహరి రామరాజు,ఇతర నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు,వివిధ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.