చింతమడకలో ఓటేసిన కెసిఆర్ దంపతులు
ఓటుహక్కు వినియోగించుకున్న కెసిఆర్ బలగం
హైదరాబాద్‌లో ఓటేసిన కెటిఆర్, కవిత
సిద్దిపేటలో ఓటు వినియోగించుకున్న హరీష్ రావు
కవిత వ్యాఖ్యలపై కేసు నమోదుకు వికాస్ రాజ్ ఆదేశం
హైదరాబాద్,నవంబర్30 (జనంసాక్షి) : తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట మండలం చింతమడకలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చిన కెసిఆర్ తన ఓటు వేశారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రానికి రాని చింతమడక ఓటర్లు..కేసీఆర్ రాగానే భారీ సంఖ్యలో క్యూ కట్టారు. ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చిన సీఎం ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం కేసీఆర్ దంపతులు హైదరాబాద్ కు బయలదేరారు. కేసీఆర్ దంపతుల వెంట మంత్రి హరీష్ రావు కూడా ఉన్నారు. చింతమడక గ్రామంలో సతీమణి శోభతో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలోని 13వ పోలింగ్ కేంద్రంలో సీఎం దంపతులు ఓటు వేశారు. సీఎంకు చింతమడక గ్రామం ఒక సెంటిమెంట్‌గా ఉంటోంది. సీఎం దంపతులు చింతమడకకు రావటంతో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఓట్ల లిస్టులో కేసీఆర్ సీరియల్ నెంబర్ 158గా ఉంది. అలాగే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ నందినగర్ ప్రాంతంలో ఓ పోలింగ్ బూత్‌లో తన భార్య శైలిమతో కలిసి ఓటు వేశారు. పోలింగ్ బూత్ బయట విూడియాతో మాట్లాడారు. తెలంగాణ పౌరుడిగా తన ఓటు హక్కు వినియోగించు కున్నానని అన్నారు. దీంతో తన బాధ్యత తాను నెరవేర్చుకున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే తాను ఓటు వేసినట్లుగా కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి కోసం పాటు పడే పార్టీకి, ఒక మంచి నాయకుడికి ఓటు వేశానని చెప్పారు. తెలంగాణలో ఓటు ఉన్న వారు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చారు. పట్టణ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ కవిత ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు. బంజారాహిల్స్‌లోని నందినగర్ ప్రాంతంలో డీఏవీ స్కూల్ పోలింగ్ స్టేషన్‌లో కవిత ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత కవిత విూడియాతో మాట్లాడారు. ప్రజలు అందరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని అందరూ ఓటు వేయాలని పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కోడ్‌ను ఉల్లంఘించేలా కవిత వ్యాఖ్యలు చేశారు. తమకు ఓటు వేయాలనే వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలు ఉన్న సంగతి తెలిసిందే. కవిత వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం కవితపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి సిద్దిపేటలో ఓటు వేశారు. భార్య శ్రీనిత, తనయుడు అర్చిస్ మాన్‌తో కలిసి వచ్చిన మంత్రి ఓటు వేసి.. ప్రజలంతా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఓటు వేసిన అనంతరం పోలింగ్ బూత్ బయట ప్రచారం చేయడంతో కవితపై ఫిర్యాదు అందినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. దీనిపై డీఈవోకు ఆదేశాలిచ్చామని ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయిందని చెప్పారు.
తెలంగాణ ఎన్నికల సరళిపై విూడియాతో మాట్లాడిన వికాస్ రాజ్ ..రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోందిని తెలిపారు. ఈవీఎం సమస్యలు వచ్చిన దగ్గర కొత్తవి మార్చామని వెల్లడిరచారు. రూరల్ లో పోలింగ్ శాతం బాగానే ఉందన్న ఆయన.. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలన్నారు.
అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయని,జరిగిన ప్రతి కంప్లైంట్స్ పై డీఈవోలను రిపోర్ట్ అడిగామన్నారు వికాస్ రాజ్. ఉదయం 11గంటల వరకు 20.64శాతం నమోదు అయిందని తెలిపారు.