ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు హాజ‌రైన ప్రభాకర్ రావు

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావు సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. నిన్న‌ హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఆయ‌న ఈరోజు సిట్ ముందు విచార‌ణ‌కు హాజ‌రయ్యారు. దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో నెలల తరబడి అమెరికాలో ఉన్న ఆయన నిన్న నగరానికి చేరుకున్నారు.  ఆదివారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన ప్రభాకర్ రావు, భారత్‌కు వచ్చిన మూడు రోజుల్లోగా అధికారుల ముందు హాజరుకావాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయన సిట్ విచారణకు మార్గం సుగమమైంది.ఇక‌, ఈ కేసులో ఏ1గా ఉన్న ఆయ‌న నుంచి కీల‌క సమాచారం రాబ‌ట్టాల‌ని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇప్ప‌టికే రాధ‌కిష‌న్ రావు, ప్ర‌ణీత్‌రావు, తిరుప‌త‌న్న‌, భుజంగ‌రావుల‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. వీరు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ప్ర‌భాక‌ర్‌రావును ప్ర‌శ్నించ‌నున్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావుపై ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటి నుంచి ఆయన అమెరికాలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో భారత అధికారులు ఆయన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడంతో పాటు రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశారు. ఏడాదికి పైగా విచారణకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నందున, నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇటీవలే ఆయన్ను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ప్రయాణ పత్రం కోసం భారత రాయబార కార్యాలయం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తరఫు న్యాయవాది గతంలో కోర్టుకు తెలియజేశారు.