రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకోవడం కాదు.. చదవాలి, పాటించాలి
- ఫిరాయింపులపై కాంగ్రెస్ రెండు నాల్కల వైఖరి
- ఆస్కార్ విజేతలా రాహుల్ పోజులొద్దు.. రాజ్యాంగ స్ఫూర్తి కాపాడు
- ఎమ్మెల్యేల కోసం ఇంటింటికీ రేవంత్.. ఫిరాయింపులపై పోరాటమే
- న్యాయం కోసం రాష్ట్రపతిని కలుస్తం: మాజీ మంత్రి కేటీఆర్
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరైనా సరే పార్టీ మారిన వెంటనే అభ్యర్థిత్వం రద్దయ్యేలా చట్టం చేస్తామని తుక్కుగూడ సభలో రాహుల్‌గాంధీ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మీరు చేస్తున్నదేంటి? మా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికీ రూ. 50 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేస్తున్నదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య గగ్గోలు పెట్టారు. మరి ఇక్కడ మీరెంతకు కొంటున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కాంగ్రెస్‌కు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుందా?పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టానికి కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడుస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్‌పై ఇక పోరాటం తప్పదని హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చిందే తామని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్తూ రాహుల్‌గాంధీ ఆస్కార్ అవార్డు గ్రహీతలా నటిస్తున్నారని విమర్శించారు. చేతిలో రాజ్యాంగ ప్రతిని పట్టుకొని పోజులు కొట్టడం మాని ఆ స్ఫూర్తిని కొనసాగించాలని హితవు పలికారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని ఢిల్లీ కేంద్రంగా ఎండగడతామని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలోని బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కేఆర్ సురేశ్‌రెడ్డి నివాసంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని తుక్కుగూడ సభలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరైనా సరే పార్టీ మారిన వెంటనే అభ్యర్థిత్వం రద్దయ్యేలా చట్టం చేస్తామని చెప్పారని, ఇప్పుడా మాటలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.
అప్పుడు గగ్గోలు పెట్టి ఇప్పుడు చేస్తున్నదేమిటి?
ఫిరాయింపు నిషేధ చట్టంపై కాంగ్రెస్ ద్వంద్వనీతి అవలంబిస్తున్నదని కేటీఆర్ దుయ్యబట్టారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానాలో తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకుంటున్నదని గగ్గోలు పెట్టిన కాం గ్రెస్ తెలంగాణలో చేస్తున్నదేమిటని నిలదీశారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకుంటున్నదని మహారాష్ట్ర పీసీసీ చీఫ్ బాలాసాహెబ్ థోరట్, కర్ణాటకలో తమ ఎమ్మెల్యేలను బీజేపీ 50 కోట్టు పెట్టి కొనుగోలు చేస్తున్నదని సీఎం సిద్ధరామయ్య ఆరోపించిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కాంగ్రెస్‌కు గోవా, కర్ణాటక, మణిపూర్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల్లో ఒక్కోచోట ఒక్కో రకంగా ఉంటుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాం
కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికీ రూ. 50 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేస్తున్నదన్న ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య ఆరోపణలను గుర్తుచేస్తూ తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేను ఎంతకు కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో న్యాయం కోసం ఢిల్లీలో నాలుగు రోజులుగా న్యాయ, రాజ్యాం గ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంత బహిరంగంగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశామని గుర్తు చేశారు. హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని వివరించారు. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. అవకాశమున్న వేదికల్లోనూ న్యా యపోరాటం చేస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ బాధిత పార్టీలతో భవిష్యత్తులో పార్టీ ఫిరాయింపుల చట్టం బలోపేతం చేసేందుకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ‘పాంచ్‌న్యాయ్’లో కాంగ్రెస్ చెప్పిన విధంగా పార్టీ మారగానే ఆటోమెటిక్‌గా సభ్యత్వం రద్దయ్యేలా చట్టం తేవాలని కేటీఆర్ కోరారు.
ప్రజల పక్షాన పోరాటం
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలు అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ రాష్ట్రంలో చేస్తున్నదేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. 2 లక్షల ఉద్యోగాలు, రుణమాఫీ, మహిళలకు 2,500, వితం తు, వృద్ధాప్య పింఛన్ 4 వేలు, దివ్యాంగులకు 6 వేలు.. ఇలా మొత్తం 420 హామీలు ఇచ్చారని, వాటి సంగతేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 4 లక్షల ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యామని, ప్రధాన ప్రతిపక్షంగా పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాళ్లతో ఇప్పుడెవర్ని కొట్టి చంపాలె?
కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేస్తుందని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ నేతలే ఇప్పుడు తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టు తిరుగుతూ పార్టీలో చేర్చుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ మారిన వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని గతంలో పిలుపునిచ్చిన రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక చేస్తున్న పని ఏమిటని ప్రశ్నించారు. తమ పార్టీ టికెట్‌తో గెలిచిన ఎమ్మెల్యేలను అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడాలేకుండా ప్రతి ఇంటికీ తిరుగుతూ చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు రాళ్లతో ఎవరిని కొట్టి చంపాలని ప్రశ్నించారు. ఎవరు పిచ్చికుకో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని నిలదీశారు.
ఆయారాం.. గయారాం.. పోచారాం
ఆరు గ్యారెంటీల్లో 420 హామీలిచ్చి వాటి అమలను గాలికి వదిలేసి ఎమ్మెల్యేలకు గాలం వేయడాన్నే పనిగా పెట్టుకున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయాలన్న ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడుతున్నదని ఆరోపించారు. తెలంగాణ హక్కుల రక్షణ విషయంలో తాము వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు. పార్టీ విలీనానికి, ఉద్దేశపూర్వక చేరికలకు తేడా ఉన్నదని చెప్పారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిర్దేశిత నియమాలకు అనుగుణంగానే తమ హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా పార్టీని విలీనం చేశారని, అలాగే బీఎస్పీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు చేసిన విలీనాన్ని ఆయన వివరించారు. హర్యానాలో గయారాం అనే ఎమ్మెల్యే నుంచి పోచారాంను చేర్చుకోవడం వరకు దుర్మార్గ సంస్కృతిని కాంగ్రెస్ పెంచి పోషిస్తున్నదని దుయ్యబట్టారు.