స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి

 

 

 

 

 

 

జనవరి 4 (జనం సాక్షి): హైదరాబాద్‌లోని నిజాంపేటలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు అర్జున్‌ దుర్మరణం చెందాడు.

బాలుడి తల్లిదండ్రులు చింతల్‌లో నివసిస్తుంటారు. అయితే వరుస సెలవులు ఉండటంతో బాలుడిని హైదర్‌నగర్‌లోని వెర్టెక్స్‌ ప్రైమ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంటున్న అమ్మమ్మ ఇంట్లో వదిలివెళ్లారు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలో ఆడుకుంటుండగా.. స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయాడు. అది ఎవరూ గమనించకపోవడంతో నీటిలో మునిగి మరణించాడు. అయితే కొద్దిసేపటికి బాలుడు నీటిపై తేలుతూ గమనించాడు. చాలాసేపటి వరకు బాలుడు కనబడకపోవడంతో వెతుక్కుంటూ అక్కడకు వచ్చిన కుటుంబసభ్యులకు నీటిలో తేలుతూ కనిపించాడు. వెంటనే అర్జున్‌ను నిజాంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతిచెందాడు.

బాలుడి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కనీసం వీకెండ్‌లో అయినా స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద కేర్‌ టేకర్స్‌ లేకపోవడం, సీసీ కెమెరాల వద్ద పర్యవేక్షకులు లేకపోవడం వల్లే తన కుమారుడిని కోల్పోవాల్సి వచ్చిందని బాలుడి తల్లిదండ్రులు వాపోయారు.