వణుకుతున్న సంక్షేమం.. ఇగంలో చన్నీళ్ల స్నానాలు

 

 

 

 

 

 

డిసెంబర్23(జనం సాక్షి);ఎముకలు కొరికే చలిలో చన్నీళ్ల స్నానం. కిటికీలు, తలుపులేని భవనాల్లో రాత్రంతా వణుకుతూ పడుకోవాల్సిన దుస్థితి. అసలే రాష్ర్టాన్ని అతి కనిష్ఠ ఉష్ణోగ్రతలు వణికిస్తున్న తరుణంలో గురుకులాల విద్యార్థుల నిత్య చలి కష్టాలు అన్నీఇన్నీ కావు. ఉదయం 7 గంటలలోపే చల్లని నీటితో కాలకృత్యాలు తీర్చుకోవల్సిందే., దుప్పటి కప్పుకుని పండుకున్నా ఆగని ఇగంలో లేచి తరగతులకు తయారవ్వాల్సిందే. పిల్లల బాధచూడలేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నా, సర్కార్‌లో చలనం లేదు, నిబంధనల్లో మార్పు రాదు. కాగితాలకే పరిమితమైన వేడినీళ్ల ముచ్చటకు అతీగతీ లేదు. ఆరోగ్యం సహకరించక చదువు సక్రమంగా కొనసాగించలేకపోతున్నామని వి ద్యార్థుల గోడు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు.

నిబంధనలతో ఇబ్బందులు

ఉదయం 7 గంటల్లోగా స్నానాలను పూర్తిచేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. వెరసి గురుకుల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చన్నీటి స్నానం చేయలేక హడలెత్తిపోతున్నారు. విద్యార్థుల అవస్థలపై తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నా సర్కారులో చలనంలేదు. ఇటు నిబంధనలు సడలించడం లేదు. అటు విద్యార్థులకు వేడినీళ్లను ఇవ్వకుండా చోద్యం చూస్తున్నది.

టైం టేబుల్‌తో విద్యార్థుల షివరింగ్‌

రాష్ట్రవ్యాప్తంగా సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీలకు తగ్గాయి. 19 జిల్లాల్లోనైతే సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలే నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మంతోపాటు, ఏజెన్సీ ఏరియాల్లో చలి తీవ్రత ఇంకా దారుణంగా తయారైంది. ఈ క్రమంలో ప్రభుత్వం గురుకుల విద్యార్థులపై మాత్రం దృష్టి సారించడం లేదు. పైగా నిరుడు ప్రభుత్వం తీసుకొచ్చిన కామన్‌ టైంటేబుల్‌ ప్రస్తుతం చలి నేపథ్యంలో విద్యార్థులకు మరింత శాపంగా మారింది. కామన్‌ టేబుల్‌ ప్రకారం విద్యార్థులు ఉదయం 5-5.15 గంటలకు నిద్ర లేవాలి, 6 గంటల వ రకు యోగా, వ్యాయామం, 7 గంటల వరకు కాలకృత్యాలు, స్నానాలు పూర్తి చేయాలి. 7.45 వరకు అల్పాహారం చేసి, 8 గంటల వరకు కిచెన్‌ ఇన్‌స్పెక్షన్‌, 8.15 గంటల వరకు ప్రేయర్‌ ఆ తర్వాత తరగతులు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఉదయం 10 గంటలు దాటినా చలితీవ్రత తగ్గకున్నా ఉదయం 7 గంటల లోపే స్నానాలను పూర్తి చేయడం పిల్లలకు సవాలుగా మారింది. తీవ్ర చలిలో, చల్లని నీటి స్నానంతో విద్యార్థులు వణుకుతున్నారు.

ఇతర వేళల్లోనూ కష్టమే

స్నానాలు చేయడానికి ఉదయం కాకుండా ఏదో సమయంలో అవకాశమిద్దామని చూసినా సర్కార్‌ టైంటేబుల్‌ ప్రకారం ఆ పరిస్థితి లేదని గురుకుల టీచర్లు వివరిస్తున్నారు. ఉదయం 8.15 గంటల నుంచి ప్రతి 45 నిమిషాల చొప్పున 11.15 గంటల వరకు మొత్తం 4 క్లాస్‌లను నిర్వహించాల్సి ఉందంటున్నారు. 10 నిమిషాల స్వల్ప విరామం అనంతరం 11.25 తరగతులు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఆ రెండు క్లాసులు నిర్వహిస్తారు. 12.45-1.30 గంటల వరకు 5, 6, 7వ తరగతుల విద్యార్థులకు లంచ్‌ కొనసాగుతుంది. 1.45-2.30 గంటల వరకు పర్సనల్‌ టైం ఉంటుంది. 12.45-1.25 గంటల వరకు 8 నుంచి ఆ పై తరగతులకు 7వ పీరియడ్‌, 1.25-2.15 వరకు లంచ్‌, 2.15-2.30 వరకు పర్సనల్‌ టైం ఉంటుంది.

మధ్యాహ్నం 4.30 గంటల వరకు క్లబ్‌ యాక్టివిటీస్‌, ప్రాజెక్ట్స్‌, కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ ఉంటాయి. సాయంత్రం 4.45 వరకు స్నాక్స్‌, 5.45 వరకు స్పోర్ట్స్‌, 6 గంటల వరకు రోల్‌కాల్‌ ఉంటుంది. 6.15 వరకు పర్సనల్‌ టైం. రాత్రి 7 గంటల వరకు డిన్నర్‌, రాత్రి 9 గంటల వరకు స్టడీ అవర్స్‌ తర్వాత విద్యార్థులకు నిద్రకు ఉపక్రమించాలి. మొత్తం 16 గంటల షెడ్యూల్‌లో విద్యార్థులకు కనీసం 2.30 గంటల పాటు పర్సనల్‌ టైము కూడా లేదు. ఉన్న సమయంలోనే బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ పూర్తి చేయాల్సి ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇప్పటికే గురుకుల విద్యార్థుల పరిస్థితి రోబోల కంటే దారుణంగా మారిందని గురుకుల టీచర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకోని సర్కారు

తీవ్రమైన చలి దృష్ట్యా ఆదిలాబాద్‌ కలెక్టర్‌ పాఠశాలల పనివేళలను ఇటీవలే మార్చారు కానీ, గురుకుల సొసైటీలు మాత్రం ఆ వైపు దృష్టిపెట్టకపోవడం బాధాకరం. ప్రస్తుత గురుకుల పనివేళలతో క్షేత్రస్థాయిలో విద్యార్థులు విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సొసైటీల్లోని ఉపాధ్యాయులు ఏడాదిగా వాపోతున్నారు. టైంటేబుల్‌ అమలు ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. అనేక గురుకులాలు ప్రైవేటు భవనాల్లోనే ఉన్నాయని, వసతులు విద్యార్థుల సంఖ్యకు సరిపడా లేవని వివరించారు.

మారిన పనివేళలతో తాము సైతం ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు మొరపెట్టుకుంటున్నారు. హాస్టళ్లలో ఉండలేమని విద్యార్థులు సైతం తల్లిదండ్రుల వద్ద కన్నీటి పర్యంతమవుతున్నారు. చిన్నారుల కష్టాలు చూడలేక తల్లిదండ్రులు ఆవేదన చెంది ప్రభుత్వం వేడినీళ్లను ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పనివేళల కారణంగా చలితీవ్రత విద్యార్థులపై మానసిక ఒత్తిడి, పౌష్టికాహారం, శారీరక వ్యాయామ లోపం, వివిధ మానసిక రుగ్మతలకు దారితీస్తున్నదని బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టైంటేబుల్‌ను సవరించాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు.

కాగితాలపైనే వేడినీళ్ల సౌకర్యం

గురుకులాల్లోని విద్యార్థులకు వేడినీళ్లను అందించాలని నిరుడు సాంఘిక సంక్షేమ గురుకుల ప్రిన్సిపాళ్లకు సొసైటీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా ఆచరణకు మాత్రం నోచుకోని దుస్థితి. వేడినీళ్ల సరఫరా కేవలం కాగితాలకే పరిమితమని, క్షేత్రస్థాయిలో అసాధ్యమని ప్రిన్సిపాళ్లు వివరిస్తున్నారు. ప్రతి గురుకులంలో సగటున 640 మంది విద్యార్థులు ఉన్నారని అంతమందికి వేడినీళ్లు ఇవ్వడం ఎలా సాధ్యమంటున్నారు. ఒక విద్యార్థి స్నానానికి 4 లీటర్లు అవసరమని అంచనా వేసినా 2,560 లీటర్‌ సమకూర్చడం కష్టమంటున్నారు. వేడినీళ్ల కోసం పాత్రలు కూడా లేవని, ప్ర స్తుత పనివేళలు సైతం వేడినీటి సరఫరాకు తీవ్ర ఆటంకంగా మారాయని తేల్చిచెబుతున్నారు. కామన్‌ టైంటేబుల్‌ నేపథ్యంలో విద్యార్థులకు ఎప్పుడు నీళ్లు సపె్లై చేయాలి.. ఎలా చేయాలో అధికారులే చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

అరకొర వసతులు

గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్‌, డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం బెడ్‌షీట్స్‌, ఉలెన్‌ బ్లాంకెట్స్‌ సరఫరా చేయాల్సి ఉన్నా ఈ ఏడాది చాలా గురుకులాల్లో బెడ్‌షీట్లను ఇ చ్చారే తప్ప బ్లాంకెట్లను ఇవ్వలేదని విద్యార్థులు వాపోతున్నారు. అదీకాకుండా 700లకు పైగా గురుకులాలు అద్దె భవనాల్లోనే సాగుతున్నాయని, స్వయానా కాం గ్రెస్‌ ప్రభుత్వమే పదే పదే చెబుతున్నది. ఆయా భవనాల్లో విద్యార్థులకు వసతులు కూడా లేకుండా పోయాయని, శాశ్వత భవనాలు ఉన్నచోట తలుపులు, కిటికీలు లేకపోవడంతో రాత్రివేళ చలికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బాత్‌రూము లు లేనిచోట విద్యార్థులు చలిలోనే స్నానాదికాలను పూర్తి చేయాల్సిన పరిస్థితి.