ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల నిరసన
హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలపై నిరుద్యోగ జేఏసీ ఉద్యమ నాయకుడు మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గాంధీ ఆస్పత్రిలోనూ దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోతీలాల్ నాయక్ ఆమరణ దీక్షకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలని ఆర్ట్స్ కాలేజీ ముందు ధర్నాకు దిగారు.
నిరుద్యోగుల డిమాండ్లు ఇవే..
-గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలి.
-గ్రూప్-2లో 2000, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలి.
-జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
-25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి.
నిరుద్యోగుల పక్షాన ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఉస్మానియా విద్యార్థి నేత మోతీలాల్ నాయక్‌కు బీఆర్‌ఎస్ సహా వివిధ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నాయి. ఆదివారం గాంధీ దవాఖానకు వెళ్లిన ఎమ్మెల్యే హరీశ్‌రావు సహా పలువురు నేతలు మోతీలాల్ నాయక్‌ను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ, యువజన నేతలు, ఓయూ ప్రొఫెసర్లు నిరుద్యోగుల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు.