ఆ గ్రామంలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకే పోలింగ్…!


చెన్నారావుపేట, డిసెంబర్ 11 (జనం సాక్షి):
8 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమే…
ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోనున్న గొల్లభామ తండా గ్రామ ఓటర్లు…
ఆ గ్రామంలో ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకే పోలింగ్ జరగనుంది. గ్రామంలో ఉన్న 8 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఇద్దరు సర్పంచ్ స్థానాలకే ఎన్నికల అధికారులు ఈనెల 17వ తేదీన పోలింగ్(ఎన్నికలు) నిర్వహించనున్నారు. మండలంలోని గొల్లభామ తండ గ్రామంలో సర్పంచ్ స్థానానికి గుగులోతు బాలు, గుగులోతు బాలాజీ లు ఇద్దరు నామినేషన్లు వేశారు. 8వార్డు సభ్యుల స్థానాలకు కూడా కొందరు గ్రామస్తులు నామినేషన్లు వేసి సోమవారం జరిగిన ఉపసంహరణలో ఉపసంహరించుకున్నారు. దీంతో 1వ వార్డు సభ్యురాలిగా మాలోతు వీరమ్మ, 2వ వార్డు సభ్యురాలిగా గుగులోతు నీల, 3 వ వార్డు సభ్యుడిగా భూక్య భాస్కర్, 4 వ వార్డు సభ్యుడిగా గుగులోతు స్వామి, 5 వ వార్డు సభ్యురాలిగా భానోత్ వనిత, 6 వ వార్డు సభ్యురాలిగా మాలోత్ గీత, 7 వ వార్డు సభ్యుడిగా బోడ రాజు, 8 వ వార్డు సభ్యురాలిగా బోడ దేవ్లి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచుల బరిలో నిలుచున్న ఇద్దరిలో ఒకరు ఉపసంహరించుకుంటే సర్పంచ్ కూడా ఏకగ్రీవం అయ్యేది. కానీ ఒక అభ్యర్థి ఉపసంహరించుకోకపోవడంతో ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈనెల 17న జరగనున్న మూడవ విడత రెండవ సాధారణ ఎన్నికలలో గొల్లభామ తండా ఓటర్లు తమ ఓటు ద్వారా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోనున్నారు.


