డి లిమిటేషన్ పేరుతో పరకాలకు అన్యాయం చేస్తే ఊరుకోం

పరకాల, డిసెంబర్ 12 (జనం సాక్షి):

బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్.

పరకాల చరిత్రను, ఉద్యమ స్ఫూర్తిని విక్రయించే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డి-లిమిటేషన్ పేరుతో పరకాల నియోజకవర్గాన్ని మార్చే కుట్ర జరుగుతుందని పరకాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు గాజుల నిరంజన్ మండిపడ్డారు.ఉద్యమకారులు ఫురిటిగడ్డ, నిజాం రజాకార్లతో పోరాడి ప్రాణాలర్పించిన పరకాలను గత బీఆర్ఎస్ పాలనలోనే జిల్లా ఏర్పాటు విషయంలో అన్యాయం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు.ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి చెందినవారు కానందున, జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామిరెడ్డి ఆత్మకూరును నియోజకవర్గ కేంద్రంగా మారుస్తానని చెప్పడం నాయకుల ముందస్తు ప్రణాళిక ప్రకారం పరకాలను చరిత్రపుటాలనుంచి తొలగించేలా ఆత్మకూరు నియోజకవర్గం ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని నిరంజన్ ఆరోపించారు. ఇది పరకాల ప్రజల భావాలకు తీవ్రమైన దెబ్బ అని పేర్కొన్నారు.పరకాల నియోజకవర్గాన్ని మార్చే ప్రయత్నం చేస్తే బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి ఉగ్ర ఉద్యమం చేస్తామని స్పష్టంచేశారు. గ్రామపంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరకాల ప్రజలు తగిన బుద్ధి చెబుతారని నిరంజన్ హెచ్చరించారు.