గద్వాల ఆసుపత్రిలో మందుల కొరత

share on facebook

ప్రైవేట్‌ ఆసుపత్రిలా తయారైందంటున్న రోగులు
జోగులాంబగద్వాల,నవంబర్‌8 (జనం సాక్షి) : జిల్లా కేంద్రంలో ఉన్న పెద్దాసుపత్రిలో అడుగడుగునా సమస్యలు తాండవిస్తున్నాయి. ఈ ఆసుపత్రిలో డాక్టర్లతో పాటు మందుల కొరత కూడా తీవ్రంగా ఉన్నది. ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న తర్వాత ఆస్పత్రి వర్గాలు ఒక చీటి ఇచ్చి ఈ మందులు తీసుకురండి అనడం ఇక్కడ సర్వసాధారణం. ఈ మందులు మళ్లీ బయటి దుకాణాలలో కొనాల్సిందే. బడ్జెట్‌ కొరత వల్ల సెంట్రల్‌ డ్రగ్స్‌ నుంచి మందుల కొరత ఉండటం వల్లే మందులు సకాలంలో రావడంలేదని ఆస్పత్రి అధికారులు చెబుతున్నారు. గద్వాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజు దాదాపు 700 నుంచి 800 దాకా ఓపీలు చూస్తారు. వీరితో పాటు కొందరు వార్డులలో చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. వీరందరికి మందులు కావాల్సిందే. కానీ ఏవో కొన్ని మందులు మాత్రమే ఆసుపత్రి నుంచి ఇచ్చి మిగితావి బయటకు చిట్టీలు రాసి పంపుతున్నారు. జిల్లా ఏర్పడక ముందు కంటే పరిస్థితి జిల్లా ఏర్పడ్డాక మరీ అధ్వానంగా తయారైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం తమకేమి సంబంధం లేనట్లు వ్యవహరించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మందులకు చిట్టీలు రాసిస్తుండటంతో వారికి ఈ ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేట్‌ ఆసుపత్రిలాగానే ఉన్నదని ఆరోపిస్తున్నారు.జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇద్దరు డాక్టర్లు ప్రైవేట్‌ మెడికల్‌ స్టోర్‌లతో కుమ్మక్కై ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులను అక్కడికే పంపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేవని, ఇక ఎప్పుడు వస్తాయో తెలియదని, వెంటనే ఆ మెడికల్‌ స్టోర్‌కు వెళ్లి తీసుకురావాలని చెబుతున్నట్లు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత ఉన్నమాట వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నారు.  అయితే సెంట్రల్‌ డ్రగ్స్‌నుంచి మందుల కొరత వల్లే ఈ సమస్య ఏర్పడింది. దీనికి తోడు అనుకున్నంత స్ధాయిలో బ్జడెట్‌ కూడా లేకపోవడం ఒక కారణమని అన్నారు.

Other News

Comments are closed.