జింబాబ్వే మాజీ అధ్యక్షుడు కన్నుమూత

share on facebook

– కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముగాబే
హరారే, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) : కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జింబాబ్వే మాజీ అధ్యక్షడు రాబర్ట్‌ ముగాబే(95) కన్నుమూశారు. ఏప్రిల్‌ నుంచి ముగాబే.. అనారోగ్యంతో సింగపూర్‌లోని ఓ హాస్పిటల్‌ లో ట్రీట్మెంట్‌ పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం ఆయన మరణించారు. 1980లో జింబాబ్వేలో బ్రిటీష్‌ వలసవాదం ముగిసినప్పటి నుంచి ముగాబే 37 ఏళ్లు అధికారంలో కొనసాగారు. 2017లో ఆర్మీ తిరుగుబాటు చేసి అధికార పగ్గాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్మీ.. దేశాన్ని తమ గుప్పిట్లోకి తీసుకోవడంతోపాటు ముగాబెను హౌజ్‌ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ముగాబేకు వ్యతిరేకంగా రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా ప్రజలు సామూహిక నిరసన ప్రదర్శనలు చేశారు. 93 ఏళ్ల వయసులో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వయసున్న దేశాధ్యక్షుడిగా ముగాబె రికార్డు సృష్టించారు. తనకు పోటీగా వస్తున్నాడంటూ చాలాకాలంగా తన డిప్యూటీగా ఉన్న ఎమర్సన్‌ ఎంనంగాగ్వాను కేబినెట్‌ నుంచి తప్పించి తన భార్య గ్రేస్‌ ముగాబెను తర్వాతి అధ్యక్షురాలిగా చేయాలని ముగాబె భావించడం ఆయన పతనానికి కారణమైంది. అనంతర పరిస్థితుల్లో ముగాబేకు తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగు దశాబ్దాలు దేశాన్ని పాలించిన రాబర్ట్‌ ముగాబే రాజీనామా చేయడంతో ఎమర్సన్‌ మ్నంగగ్వా దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఎమర్సన్‌ గతంలో ఉపాధ్యక్షుడిగా చేశారు. రెండు వారాల క్రితం జరిగిన కేబినెట్‌ సమావేశంలో అధ్యక్షుడు ఎమర్సన్‌ మాట్లాడుతూ.. డాక్టర్లు ముగాబేకి ట్రీట్మెంట్‌ ను నిలిపివేశారన్నారు. శుక్రవారం ఆయన ట్వీట్‌లో ముగాబే మరణవార్తను ధృవీకరించారు. జింబాబ్వే వ్యవస్థాపక తండ్రి, మాజీ అధ్యక్షుడు మరణవార్తను ప్రకటించడం చాలా బాధగా ఉందని ఎమర్సన్‌ తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Other News

Comments are closed.