దళారుల ప్రమేయం లేకుండా కొనుగోళ్లు

share on facebook

పక్కాగా చర్యలు తీసుకున్న పౌరసరఫరాల అధికారులు
ఖమ్మం,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఈ వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేసింది. రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పలు సూచనలు చేసింది. గ్రామాల్లో రైతులను చైతన్యవంతం చేసేందుకు మద్దతు ధర కొనుగోలుకు నిర్ధేశించిన ప్రమాణాలను కరపత్రాల ప్రచారం చేశారు. మరోవైపు గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తులు కాంటాలు పెట్టి ప్రజలను మోసం చేయకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగవద్దని, ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలో నగదు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్థాయి అధికారులు పేర్కొన్నారు.  దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలో 445 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు అధికారులు నిర్ణయించారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోని మహిళా సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజాపంపిణీ అవసరాల దృష్ట్యా పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొనుగోళ్లు సాగుతున్నాయి. అలాగే రైతుల ఖాతాల్లో నేరుగా నగదను జమ చేస్తున్నారు.  సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రభుత్వం ప్రణాళికను రూపొందించి అమలు చేస్తుంది. పండించిన పంటకు గిట్టుబాటు ధరను అందించే లక్ష్యంతో ముందుకు సాగుతుంది.  ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 4లక్షల 60 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించింది. జిల్లాలో రైతులు ఈ సీజన్‌లో 7లక్షల 5 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్నాన్ని పండించినట్లుగా అధికారులు అంచనా వేశారు. దీనిలో దాదాపు లక్ష ఎకరాల్లో లావురకం ధాన్యం కాగా మిగిలిన 6లక్షల ఎకరాల్లో సన్నరకం ధాన్యం పండించారు.  ప్రభుత్వం ఈ ఏడాది గ్రేడ్‌ -ఏ రకానికి క్వింటాకు రూ.1888 ధర నిర్ణయించగా, కామన్‌ రకం ధాన్యానికి రూ.1868గా నిర్ణయించింది.  కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌ మిల్లులకు కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం తరలిస్తున్నారు. ఇక భద్రాద్రి జిల్లాలలోనూ  గత ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లకు 194 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈ సారి రికార్డు స్థాయిలో 248 కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 210 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయడంతో రైతు పండించిన పంట పూర్తి స్థాయిలో సర్కారు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయాలు జరుగుతున్నాయి. గతేడాది వానకాలంలో 1,30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. యాసంగిలో 60,400 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ ఏడాది 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో మార్కెట్‌లో ధాన్యం ధరలు పెరిగి రైతులకు మేలు కలుగుతుంది. తేమశాతం, చెత్త, ఇతర వాటి శాతం అధికంగా ఉంటే మార్కెట్‌లో విక్రయిస్తున్నా మరీ తక్కువ కాకుండా విక్రయించే పరిస్థితి కేవలం కొనుగోలు కేంద్రాల వల్లే ఏర్పడిందని అంటున్నారు.

Other News

Comments are closed.