దీపావళికి బాణాసంచా కాల్చకపోవడమే మంచిది ! 

share on facebook

కరోనా ఇంకా మనలను వీడలేదు. మననీడలా వెన్నాడుతూనే ఉంది. దీంతో పండగల్లో మజా లేకుండా పోయింది. పండగలపై కరోనా పడగనీడ కారణంగా ఏ పండగను ప్రజలు ఆస్వాదించలేక పోయారు. ఉగాది మొదలు మొన్నటి దసరా వరకు ఏ పండగా సక్రమంగా జరగలేదు. ప్రజలు జరుపుకోలేదు. తాజాగా ఇప్పుడు దీపావళి కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో మళ్లీ పండగపై ఆశలు ఉండడం సహజమే. బాణాసంచా కాల్చాలని పిల్లలు ఉబలాటపడుతుంటారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ పండగకూడా మనం ఇంటికే పరిమితం కావాల్సి ఉంది. బయట కరోనా వేవ్‌ కొనసాగుతోంది. చలికాలం కావడంతో అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయమిది. దీనికితోడు కాలుష్యానికి దూరంగా ఉండాల్సిందే. ఇంకా మనలను కరోనా పీడ వీడనందున దీపావళి బాణాసంచాకు కూడా దూరంగా ఉండాల్సిందే. ఊపిరితిత్తులకు హాని కలిగించే కాలుష్యకారక బాణాసంచాకు పూర్తిగా దూరంగా ఉంటామని, కాల్చబోమని ప్రజలు ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఇది మనకే కాకుండా మన చుట్టుపక్కల వారికి కూడా అవసరమే. మనం కాల్చే బాణాసంచా ఇతరులకు హాని కలిగించే ప్రమాదం ఉంది. గతంలో బాణాసంచా కాల్చడం వేరు.. ఇప్పుడు కాల్చకుండా ఉండడం వేరు అన్నది గుర్తుంచుకుని దీపావళిని కేవలం దీపాలకే పరిమితం చేయడం మంచిది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు బాణాసంచాపై నిషేధం విధించాయి. ప్రభుత్వాలు నిషేధించిన క్రమంలో ప్రజలే దానిని నిషేధించుకుని దీపావళిని సంప్రదాయబద్దంగా పూజలతో ఇంటికే పరిమితం కావడంపై దృష్టి సారించాలి. దీపావళి పండుగ సవిూపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తున్నాయి. కొన్ని రాష్టాల్రు పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తే ,మరికొన్ని రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న కాలుష్య కారక టపాసులు కాల్చడంపై నిషేధం విధించాయి. కరోనా వైరస్‌ విజృంభణ, కాలుష్యం పెరిగిపోతూ ఉండడం వల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకు న్నాయి. ఒక్కో రాష్ట్రం బాణసంచా కాల్చడంలో నిషేధం విధించడంతో తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశంలో బాణసంచాలో 90 శాతం తమిళనాడులోని శివకాశి ఇతర ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతూ ఉండడంతో చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపడం ద్వారా వారిని కూడా ప్రమాదా లకు దూరంగా పెట్టాలి. కరోనాతో అనేక రంగాల్లో ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు బాణాసంచాపై ఆధార పడి వేలాదిమంది పని చేస్తున్న దరిమిలా వారికి ఉపాధి ఇవ్వడం లేదా, భృతి ఇవ్వడమన్నది తమిళనాడు ప్రభుత్వంపై ఉంది. ఇకమరోవైపు ఢిల్లీని కాలుష్యం వేధిస్తోంది. ఢిల్లీలో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతూ ఉండడంతో దానిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీపావళి పండుగ నేపథ్యంలో రాజధానిలో కాలుష్యం పెరిగిపోతోందంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన బెంచ్‌ వీలైనంత త్వరగా కాలుష్య నివారణకు ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించింది. టపాసులపై నిషేధం విధించిన రాష్ట్రాల్లో ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, రాజస్తాన్‌, సిక్కిం, కర్ణాటక,హర్యానా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. బాణసంచా కాల్చడంతో వాయు కాలుష్యం పెరిగి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని, కోవిడ్‌ విజృంభి స్తున్న వేళ టపాసులు కాల్చడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో పలు రాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించాయి. ఢిల్లీలో నవంబర్‌ 30 వరకు బాణసంచా కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకటించారు. దీపావళి పండుగ వేళ దేశంలో పటాకుల విక్రయాలు, వినియోగంపైనిషేధం విధించే రాష్ట్రాల జాబితాలో హర్యానా కూడా తాజాగా చేరింది. కరోనా మహమ్మారి, శీతాకాలం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. బాణాసంచ పేల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని, దీంతో కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విక్రయాలను బ్యాన్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌ పేర్కొన్నారు. ఢిల్లీల్లో ఈ నెల 7 నుంచి 30వ తేదీ వరకు నిషేధం కొనసాగుతుందని ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ ప్రకటించారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి మూడోసారి విజృంభిస్తున్నది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు సుమారు ఏడు వేల వరకు వైరస్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే వరుస పండుగలు, గాలి కాలుష్యం కరోనా వ్యాప్తికి కారణమని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పర్యావరణ హిత పటాకులపైనా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. పటాకులపై నిషేధం విధించిన ఢిల్లీ ప్రభుత్వం తాజాగా జరిమానాల గురించి కూడా వెల్లడించింది. దీపావళి పండుగ నేపథ్యంలో పటాకులు అమ్మినా లేక కాల్చినా రూ.లక్ష వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ శుక్రవారం ఈ విషయం తెలిపారు. పటాకులు అమ్ముతున్న లేదా కాల్చినట్టుగా కనిపించిన వ్యక్తులపై గాలి కేసులు నమోదు చేస్తామని ఆయన చెప్పారు. ఈ చట్టం కింద గరిష్ఠంగా రూ.లక్ష వరకు జరిమానా విధించవచ్చని మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. పటాకుల నిషేధంపై కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ సంస్థ, పర్యావరణ శాఖ, ఢిల్లీ పోలీసులతో కలిసి సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. చలికాలం, కరోనా వైరస్‌ గాలి నాణ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒడిశా, రాజస్థాన్‌ రాష్టాల్రు నిషేధం విధించాయి. మహారాష్ట్ర సర్కారు సైతం టపాసులకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. అయితే అమ్మకాలు, వినియోగంపై మాత్రం నిషేధం విధించలేదు. పశ్చిమ బెంగాల్‌లో కాళీపూజ సందర్భంగా ఆ రాష్ట్ర టపాసులపై హైకోర్టు బ్యాన్‌ విధించింది. మరో వైపు బాణాసంచ కాల్చడంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని తమిళనాడు సీఎం పళనిస్వామి రాజస్థాన్‌, ఒడిశా సీఎంలకు లేఖ రాశారు. తమిళనాడులో బాణాసంచ ఉత్పత్తి ద్వారా ప్రత్యక్షంగా నాలుగు లక్షల మంది, పరోక్షంగా మరో నాలుగు లక్షల మంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే బాణాసంచ ఉత్పత్తి చేస్తున్నారని, దీంతో కాలుష్య సమస్య ఏర్పడ దన్నారు. ఈ మేరకు టపాసుల విక్రయాలు, వినియోగంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.

Other News

Comments are closed.