దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్‌రావు విజయం

share on facebook

సిద్దిపేట : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం నమోదైంది. నువ్వా నేనా అన్న రీతిలో సాగిన పోరులో అనూహ్య రీతిలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. నరాలు తెగే ఉత్కంఠ నడమ సాగిన పోరులో చివరి నాలుగు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కనబర్చి టీఆర్‌ఎస్‌ కంచుకోటలో తొలిసారి కాషాయ జెండా ఎగరేసింది. 1470 ఓట్ల మెజార్టీతో సమీప అభ్యర్థి సోలిపేట సుజాతపై రఘునందన్‌ విజయం సాధించారు. టీ-20 మ్యాచ్‌లా సాగిన పోరులో మొదటి పది రౌండ్స్‌లో బీజేపీ పూర్తిస్థాయి ఆధిక్యం కనబర్చగా.. అనుహ్యంగా పుంజుకున్న టీఆర్‌ఎస్‌ 11 నుంచి 20 రౌండ్‌ వరకు ఆధిక్యంలోకి దూసుకొచ్చి బీజేపీకి సవాలు విసిరింది. ఓ సమయంలో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమనే రీతిలో ఆధిక్యం కనబర్చింది. అయితే పడిలేచిన కెరటంలా చివరి నాలుగు రౌండ్స్‌లో బీజేపీ లీడ్‌లోకి వచ్చి.. ఉత్కంఠకు తెరదించింది. వరుసగా 20,21,22,23 రౌండ్స్‌లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి.. సంచలన విజయాన్ని నమోదు చేసింది. దుబ్బాక విజయంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Other News

Comments are closed.