దేశానికి ఆదర్శంగా తెలంగాణ రైతు విధానాలు

share on facebook

అంతటా అమలు చేస్తే హరిత విప్లవం సాధ్యమే
నల్లగొండ,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  తెలంగాణలో సిఎం కెసిఆర్‌ అనుసరిస్తున్న రైతు విధానాలను భారతదేశ వ్యాప్తంగా అమలు చేస్తే దేశంలో హరితవిప్లవం సాధించవచ్చని  సూర్యాపేట జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ , టిఆర్‌ఎస్‌ నేత గోపగాని నారాయణ అభిప్రాయపడ్డారు. రైతులకు సాగునీరు, పెట్టుబడి పథకం,బీమా పథకం అమలు చేయడం, పండిన ధాన్యం కొనుగోలు చేయడం వంటి పథకాలు పక్కాగా అమలయితే దేశంలో కరువు కాటకాలు ఉండవన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడరని అన్నారు. ఇవన్నీ సాకారం చేసుకునే దిశగా తెలంగాణ ఒక్కో అడుగు వేస్తున్నదని, వేసిన అడుగు విజయవంగా సాగుతున్నదని అన్నారు. రానున్న కాలంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో ఓ రోల్‌ మాడల్‌గా నిలవబోతున్నదని అన్నారు. రైతుబీమా పథకం దేశానికే మార్గదర్శకంగా మారనుందని అన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలని తపిస్తున్న సిఎం కెసిఆర్‌  రైతును రాజు చేయడమే లక్ష్యంగా అనేకానేక చర్యలు తీసుకుని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేయడమే ఓఓ కీలక నిర్ణయమని అన్నారు. ఇలా వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి, ప్రవేశపెట్టిన పథకాలు గురించి సీఎం కేసీఆర్‌ చేస్తున్నట్లుఆ దేశంలో ఎక్కడా సాగడం లేదన్నారు.  తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ వ్యవసాయరంగంలో నంబర్‌వన్‌ రాష్ట్రంగా నిలిచిందన్నారు. 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి బీమా పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ప్రతి రైతుకు ప్రభుత్వం రూ.2,271 ప్రీమియం చెల్లిస్తున్నదని, ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే నామినీకి పది రోజుల్లో రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ అందుతుందని చెప్పారు. అందుకే ఈ పథకాలను తెలుసుకున్న దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సీఎం కేసీఆర్‌ను కొనియాడు తున్నాయన్నారు. రైతుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌ రైతుబీమా పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారని అన్నారు.ఎన్నడూలేని విధంగా పంటలకు మద్దతు ధర కల్పిస్తున్నారని, పక్క రాష్టాల్ల్రో సరైన మద్దతు ధర లభించని రైతులు కూడా తెలంగాణకు వచ్చి  అమ్ముకుంటున్నారని తెలిపారు. కాళేశ్వరం సహా చేపట్టిన అన్ని ప్రాజెక్టులు పూర్తయితే ఇక సాగునీటికి ఢోకా ఉండదన్నారు. ఇప్పటికే చెరువుల పునరుద్దరణ జోరుగా సాగుతోందన్నారు. దీంతో సేద్యం అన్నది రైతుకు భారం కాబోదన్నారు. దేశంలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని పేర్కొన్నారు.

Other News

Comments are closed.