నేటినుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులు

share on facebook

ఆదిలాబాద్‌,అక్టోబర్‌11 (జ‌నంసాక్షి): బతుకమ్మ, దసరా సెలవులను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల 12 నుంచి 18 తేదీ వరకు హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌, ఉట్నూర్‌, నిర్మల్‌, భైంసా, ఆసిఫాబాద్‌, మంచిర్యాల బస్‌స్టేషన్లకు బస్సు సర్వీసులు నడుస్తాయి. ప్రయాణికుల రద్దీని బట్టి అప్పటికప్పుడు మరిన్ని బస్సులను పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలకు, విద్యాసంస్థలకు 15రోజుల పాటు సెలవులు ప్రకటించింది. హైదరాబాద్‌ లో ఉద్యోగ రీత్యా ఉంటున్న వారు, ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌లో ఉంటున్న యువతీ యువకులు పండుగల సందర్భంగా తమ స్వస్థలాలకు చేరుకుంటారు. దీంతో రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకొనే బతుకమ్మ, దసరా ఉత్సవాలకు ప్రజలను తరలించేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.  రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు డిపోల వారీగా అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. బస్సుల్లో సీట్లు దొరకక చాలా మంది ప్రయాణికులు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తారు. ఇదే అదనుగా భావించి వారు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని డిపోల వారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌ రీజియన్‌ పరిధిలో ఆరు డిపోలు ఉండగా.. మొత్తం 326 బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం రాజేంద్ర ప్రసాద్‌, డీవీఎం రమేశ్‌లు పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు పండకుండా ఉండేందుకు అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్‌ నుంచి డిపోల వారీగా బస్సులను ఏర్పాటు చేశారు. పండుగ తర్వాత తిరిగి హైదరాబాద్‌కు వెళ్లడానికి బస్సులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Other News

Comments are closed.