మున్సిపాలిటీలన్నీ టీఆర్‌ఎస్‌ వశం

share on facebook

పావులు కదిపిన ఎమ్మెల్యే దాసరి

అనుకున్న వారికి పదవులు వచ్చేలా వ్యూహం

పెద్దపల్లి,జనవరి28(జ‌నంసాక్షి): ఊహించినట్లుగానే జిల్లాలోని రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహా పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంథని మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ పార్టీ వశ మయ్యాయి. రామగుండంలో టీఆర్‌ఎస్‌కు మెజారిటీ లేకున్నా ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, స్వతంత్రులు, ఇద్దరు బీజేపీ కార్పొరేటర్ల మద్దతుతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలను కైవసం చేసుకున్నది. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీకి మెజారిటీ ఉన్నా పార్టీలోనే కోవర్టు జరగవచ్చని భావించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్ల మద్దతును కూడగట్టడంతో అక్కడ పార్టీ గ్టటెక్కింది. /ూమగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు గాను టీఆర్‌ఎస్‌ 18 డివిజన్లలో గెలుపొందగా, 11 డివిజన్లలో కాంగ్రెస్‌, 6 డివిజన్లలో బీజేపీ, 9 డివిజన్లలో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, 6 డివిజన్లలో స్వతంత్రులు గెలుపొందారు. మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు కావాల్సిన మెజారిటీ టీఆర్‌ఎస్‌కు లేకపోవడంతో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండ సురేందర్‌ రెడ్డితో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంతనాలు జరపడంతో ఆయన ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఫలానా వారికి ఓటు వేయాలని విప్‌ జారీ చేయలేదు. వారితో పాటు ఆరుగురు స్వతంత్రులు, బీజేపీ నుంచి గెలుపొందిన వారిలో 43వ డివిజన్‌ కార్పొరేటర్‌ ధరణి స్వప్న, 48వ డివిజన్‌ నుంచి గెలుపొందిన పొన్నం విద్య టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు పలికారు. 35 మంది కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యే ఎన్నికకు హాజరు కాగా, మేయర్‌గా 30వ డివిజన్‌ నుంచి గెలుపొందిన డాక్టర్‌ బంగి అనిల్‌ కుమార్‌, డిప్యూటీ మేయర్‌గా 4వ డివిజన్‌ నుంచి గెలుపొందిన అభిషేక్‌రావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌, బీజేపీ కార్పొరేట ర్లు గైర్హాజరు కావడంతో ఎన్నిక ఏకపక్షంగా సాగింది. పెద్దపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోడలు 21వ వార్డు కౌన్సిలర్‌ చిట్టిరెడ్డి మమత చైర్మన్‌గా ఎన్నిక కాగా, వైస్‌ చైర్మన్‌గా 36వ వార్డు కౌన్సిలర్‌ నాజ్మిన్‌ సుల్తానా ఎన్నికయ్యారు. ఇక్కడ 36 వార్డులకు గాను టీఆర్‌ఎస్‌ 24 వార్డుల్లో గెలుపొందగా, ఇద్దరు స్వతంత్రులు సైతం టీఆర్‌ఎస్‌లో చేరడంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులకు ప్రతిపక్షాల నుంచి పోటీ లేకుండా పోయింది. మంథని మున్సిపాలిటీలో 2వ వార్డు కౌన్సిలర్‌ జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ సతీమణి పుట్ట శైలజ చైర్మన్‌గా ఎన్నిక కాగా, వైస్‌ చైర్మన్‌గా 3వ వార్డు కౌన్సిలర్‌ ఆరెపల్లి కుమార్‌ అయ్యారు. ఇక్కడ 13 వార్డులు ఉండగా, టీఆర్‌ఎస్‌ 11, కాంగ్రెస్‌ 2 వార్డుల్లో గెలుపొందింది. సుల్తానాబాద్‌ మున్సిపాలిటీలో చైర్మన్‌, వైస్‌ చైర్మ న్‌ ఎన్నికపై హైడ్రామా చోటుచేసుకున్నది. ఇక్కడ 15 వార్డులకు గాను 9 వార్డులను టీఆర్‌ఎస్‌ గెలు చుకోగా, 6 వార్డుల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. టీఆర్‌ఎస్‌ నుంచి చైర్మన్‌ పదవిని గాజుల లక్ష్మి ఆశించగా అనూహ్యంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ముత్యాల సునీత, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిగా బిరుదు సమత పేర్లను తెరపైకి తీసు కువచ్చారు. ఎన్నిక జరగడానికి ముందే వారి పేర్లను ప్రకటించడంతో గాజుల లక్ష్మి షాక్‌కు గురయ్యారు. గాజుల లక్ష్మిని చైర్మన్‌ చేయకుంటే ఏమైనా పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉండవచ్చని భావించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి రాత్రికిరాత్రే కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన వారితో మంతనాలు జరపడంతో ఐదుగురు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వారి మద్దతు ఎలాగైనా ఉందని భావించిన ఎమ్మెల్యే ముత్యం సునీతను చైర్మన్‌గా, బిరుదు సమతను వైస్‌ చైర్మన్‌గా ప్రతిపాదించడంతో ఎన్నిక లాంఛనంగా జరిగింది. చైర్మన్‌ పదవి ఆశించిన గాజుల లక్ష్మి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో ఓటు వేయకపోగా, ఆరుగురు కాంగ్రెస్‌ కౌన్సిలర్లలో గొట్టం లక్ష్మి మినహా ఐదుగురు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించడం గమనార్హం. దీంతో కాంగ్రెస్‌ పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. వీరంతా పార్టీలో ఉంటారా, టీఆర్‌ఎస్‌లో చేరతారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నిక సందర్భంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు నిర్వహించారు.

Other News

Comments are closed.