-->

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా నిలిచాం


7 లక్షలకు పైగా బాధితులకు రూ.666.84 కోట్లు జమ
ప్రైవేట్‌ రంగంలో మోసపోయిన వారిని ఆదుకున్న ఘనత ఎపిదే
గత ప్రభుత్వం సంస్థతో లాలూచీ పడి మోసం చేసింది
క్యాంపు కార్యాలయంలో బాధితులకు డబ్బులు జమచేసిన సిఎం జగన్‌
అమరావతి,ఆగస్ట్‌24(జనంసాక్షి): అగ్రిగోల్డ్‌లో ఉన్న డబ్బంతా కష్టజీవులదే.. ఆ సొమ్మునే కాజేయాలని చూశారని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం నగదును జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ 7 లక్షలకు పైగా అగ్రిగోల్డ్‌
బాధితులకు రూ.666.84 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఓ ప్రైవేట్‌ కంపెనీ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును…ప్రభుత్వం చెల్లించిన దాఖలాలు దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదన్నారు. గత ప్రభుత్వంలోని వ్యక్తుల కోసం జరిగిన మోసం ఇది అని విమర్శించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేసే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. గత ప్రభుత్వమే కర్త, కర్మ, క్రియగా జరిగిన అగ్రిగోల్డ్‌ స్కాం ఇది అని సీఎం ఆరోపించారు. డిపాజిట్‌దారుల సంఖ్య గత ప్రభుత్వం తగ్గించేసిందన్నారు. ఎన్నికలకు ముందు జీవో ఇచ్చారని.. కానీ రూపాయి కూడా ఇవ్వలేదని జగన్‌ వ్యాఖ్యానించారు. లక్షల మంది ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి నష్టపోయారని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల ఖాతాల్లో రూ.666.84 కోట్లను ఆయన జమ చేశారు. అనంతరం జగన్‌ మాట్లాడారు. అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసి పేదలు, చిన్న వ్యాపారులు మోసపోయారన్నారు. ఎవరూ నష్టపోకూడదని ఇంటింటికీ వెళ్లి బాధితులను గుర్తించామని తెలిపారు. రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన 3.86 లక్షల మంది బాధితులకు రూ.207.61 కోట్లు, రూ.10వేల నుంచి రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన 3.14 లక్షల మంది బాధితులకు రూ.459.23 కోట్లు చెల్లించామని జగన్‌ అన్నారు. 2019 నవంబరులో మొదటి విడత కింద రూ.238 కోట్లు చెల్లించినట్లు వివరించారు. మొత్తం 10.4 లక్షల మందికి రూ.905.57 కోట్లు ఇచ్చామన్నారు. కోర్టు కేసులు కొలిక్కి రాగానే అగ్రిగోల్డ్‌ భూములు, ఆస్తులు అమ్ముతాం. ప్రభుత్వ
నగదు తీసుకొని మిగతా డబ్బును డిపాజిట్‌దారులకు అందిస్తాం. ప్రైవేటు సంస్థ మోసం చేసి ఎగ్గొట్టిన డబ్బును ప్రభుత్వం ఇస్తోంది. బాధితులకు రూ.785 కోట్లు చెల్లించాలని నిర్దారించిన గత ప్రభుత్వం ఒక్క రూపాయీ ఇవ్వలేదని ఈ సందర్భంగా జగన్‌ విమర్శించారు. అలాగే అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హావిూని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా 10లక్షల 45వేల కుటుంబాలకు రూ.905.57 కోట్లు చెల్లించినట్లు సీఎం జగన్‌ తెలిపారు. ప్రైవేట్‌ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని సీఎం జగన్‌ అన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న మనుషుల కోసమే అగ్రిగోల్డ్‌ స్కామ్‌ జరిగిందని, గత ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతో కుమ్మక్కైందని సీఎం జగన్‌ అన్నారు.అగ్రిగోల్డ్‌ వ్యవహారం కొలిక్కి రాగానే మిగిలిన డిపాజిటర్లకు చెల్లింపులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ సంస్థను నమ్మి చిన్న వ్యాపారులు నష్టపోయారని, ఆ సంస్థలో ఉన్న డబ్బంతా కష్టజీవులదేనని సీఎం జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ప్రైవేట్‌ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, గతంలో 300 మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు సీఎం జగన్‌ అండగా నిలిచారని తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేస్తున్నారని, ఇప్పటికే రూ.10వేలలోపు డిపాజిటర్లకు రూ.238.73 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. ఇతర రాష్టాల్లో బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు మొదటి దశలో రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.40 లక్షల మందికి 2019లోనే రూ.238.73 కోట్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీంతో మొదటి, రెండో దశలో కలిపి మొత్తం 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం రూ.905.57 కోట్లు పంపిణీ చేసినట్లు అయింది.