అటవీ సంపదను కొల్లగొట్టేవారిని కాల్చిపారేయాలి: మంత్రి డీఎల్
కడప, జూలై 31: అటవీ సంపదను కొల్లగొట్టేవారిని ఎన్‌కౌంటర్ చేసినా ఎలాంటి నష్టం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. అటవీ సంపదను కొల్లగొట్టేవారిని కఠినంగా శిక్షించేందుకు వీలుగా అటవీ శాఖ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మైదుకూరు మండలం ముదిరెడ్డి పల్లి గ్రామంలో మంగళవారం జరిగిన 63వ వన సంరక్షణ మహోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ శాఖకు ప్రస్తుతం ఉన్న చట్టాలు పరిమితమైనందునా అటవీ సంపద యథేచ్ఛగా దోపిడీకి గురవుతుందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో చెట్లు నరికిన వారిని కాల్చివేసినా ఎలాంటి నష్టం లేదని ఆయన చెప్పారు. అటవీ సంపద పరిరక్షణకు కొత్త చట్టాలు ఎంత అవసరమో ప్రజల్లో చైతన్యం కూడా అంతే అవసరమని అన్నారు. స్మగ్లర్ల పట్ల ప్రజలు తిరగబడాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో ఒక మాజీ శాసనసభ్యుడి అనుచరులుగా కొనసాగుతున్న ఎర్రచందనం స్మగ్లర్లు కొందరు తన వద్దకు వచ్చి కేసులను రక్షించాలని కోరారని మంత్రి డీఎల్ చెప్పారు. వారిని చీవాట్లు పెట్టి పంపినట్టు చెప్పారు.ప్రజలు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించరాదని అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.