అభ్యర్థుల భవితవ్యం.. తేలేది నేడే..

` ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
` 10 గంటలలోపు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం
` 49 కౌంటింగ్‌ కేంద్రాలు.. మొత్తం 1766 టేబుల్స్‌
` అదనపు బలగాలను సిద్ధంగా ఉంచాలని డీజీపీ ఆదేశాలు
` రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల మూసివేత

దాదాపు 60 గంటలకుపైగా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓటరు నిర్ణయం ఎటువైపే ఈరోజు తేలిపోనుంది. ఎత్తుకు పైఎత్తులు.. వ్యూహాలకు ప్రతివ్యూహాలూ.. విమర్శకు ప్రతివిమర్శలు ఎక్కుపెట్టి మరీ ఎన్నికల సమరంలో పాల్గొన్న అభ్యర్థుల భవితవ్యం ఇంకొన్ని క్షణాల్లో వెల్లడి కానుంది. రెండురోజులుగా తీరిక దొరికిందని ఇండ్లకే పరిమితమైన అభ్యర్థులు నేటి తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గెలుపోటములు ఎలా ఉన్నా ప్రజలతో కలిసి పనిచేస్తామని కొందరు నొక్కిచెబుతుండగా.. పదవిలోకి రాగానే ప్రధాన సమస్యలను పరిష్కరించే ప్రణాళికల్లో ఇంకొందరున్నట్టు పేర్కొంటున్నారు.

హైదరాబాద్‌ ప్రత్యేక ప్రతినిధి, డిసెంబర్‌ 2 (జనంసాక్షి):ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సమయం ఆసన్నమైంది. ఎమ్మెల్యేగా ఎవరు విజేతలో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు భారీగా మోహరించగా.. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. 49 కౌంటింగ్‌ కేంద్రాల్లో, 119 నియోజకవర్గాల వారిగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10గంటల కల్లా తొలి ఫలితం వచ్చేస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చెల్‌ జిల్లాలో 29 కౌంటింగ్‌ కేంద్రాలు ఉండగా.. అన్నిచోట్లా పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్‌ అమలు చేశారు. కౌంటింగ్‌ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించారు.  రాష్ట్రవ్యాప్తంగా నేడు  మద్యం దుకాణాలు బంద్‌ చేశారు. ఉదయం 5గంటలకే కౌంటింగ్‌ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది చేరుకోనున్నారు. ఆర్వో ధృవీకరించిన తర్వాత 20 నిమిషాల్లో ఒక్కో రౌండ్‌ ఫలితం వెలువడనుంది. వేగంగా ఫలితాలు ఇచ్చేందుకు ప్రత్యేక సాప్ట్‌ వేర్‌ ప్రవేశపెట్టగా.. మొత్తంగా 1766 టేబుల్స్‌ అందుబాటులో ఉంచారు.
గురువారం రాత్రే ఈవీఎంలను పార్టీ ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంరూంలకు తరలించారు.  ఈవీఎంలు భద్రపరిచిన గదుల దగ్గరకు ఎవరినీ  అనుమతించడం లేదు. స్టాంª`రగ్‌ రూంల దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. డీసీపీ స్థాయి అధికారి ఇద్దరు సీఐలు, నలుగులు ఎస్‌ఐలతో పాటు కేంద్ర బలగాలు స్ట్రాంగ్‌  రూముల దగ్గర పహారా కాస్తున్నాయి. మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల దగ్గర బందోబస్తు విధుల్లో ఉంచారు. ఓట్ల లెక్కింపు పక్రియ ప్రారంభమయ్యే వరకు  రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమల్లోనే ఉంటుంది. తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బంధీ ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో  హైదరాబాద్‌ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు పెట్టారు. ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో చేపడుతున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే… రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు అధికారులు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ కోసం మొత్తం 17వందల 66 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 పోలింగ్‌ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్‌, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. ఒక్కో టేబుల్‌ దగ్గర మైక్రో అబ్జర్వర్‌, ఒక కౌంటింగ్‌ సూపర్‌ వైజర్‌, ఇద్దరు అసిస్టెంట్లను కేటాయించారు. చిన్న నియోజకవర్గంలో ఉదయం 10గంటలకల్లా ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఇక, పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్‌ చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా  జరుగుతుందని చెప్పారు వికాస్‌రాజ్‌. లక్షా 80వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నార న్నారు. తెలంగాణ ఎన్నికల బరిలో 2వేల 290 మంది  అభ్యర్థులు ఉండగా… వీరిలో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్‌. తెలంగాణలో మొత్తం 71.06 శాతం పోలింగ్‌ జరిగిందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉంటారని వెల్లడిరచారు.  పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. కూకట్‌పల్లి, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, పఠాన చెరువు, నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలు 400 పైగా ఉండటంతో ఇక్కడ మాత్రం 20 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్‌, ఎల్బీనగర్‌, శేర్‌లింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్‌ నియోజకవర్గాల్లో 500 పైగా పోలింగ్‌ కేంద్రాలుండటంతో 28 టేబుల్స్‌ ఏర్పాటు చేయడం జరిగింది.రేపు జరుగనున్న కౌంటింగ్‌ ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీలతో డీజీపీ అంజనీ కుమార్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
పికెటింగ్‌.. అదనపు బలగాలు
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం జరగనున్న ఓట్ల కౌంటింగ్‌ భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌ తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కౌంటింగ్‌ సెంటర్లలో ఫలితాలు వస్తున్న సమయంలో, కౌంటింగ్‌ సెంటర్‌ బయట కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రౌండ్ల వారీగా వస్తున్న వివరాలను బట్టి కౌంటింగ్‌ సెంటర్‌ బయట పోలీసు బందోబస్తును పై అధికారులు సవిూక్షించాలని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల మధ్య ఎలాంటి ఘర్షణలు జరగాకుండా జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వారి ఆస్తులకు కూడా భద్రత కల్పించామని చెప్పారు. గెలిచిన అభ్యర్థులు ర్యాలీ తీసే విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్‌ సూచించారు. సీపీలు, ఎస్‌పీలతో డీజీపీ శనివారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తుపై సవిూక్షించారు.  చివరి రౌండ్లలో ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంటుందని, ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఎవరినీ గుమిగూడనివ్వొద్దని, పికెటింగ్‌ చేయడంతో పాటు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ప్రతీకారదాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులతో పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని, ఎవరు గెలుపొందిన పోలీసులకు సహకరించేలా వివరించాలని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి విఘాతం లేకుండా ఎన్నికల బందోబస్తు నిర్వహించామని, ఈ రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండి, ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సీపీలు, ఎస్పీలను అంజనీ కుమార్‌ ఆదేశించారు.
రేవంత్‌ ఇంటివద్ద పోలీసుల మోహరింపు
టీపీసీసీ అధినేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మెజార్టీ ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం అని తెలవడంతో రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. గతంలో కంటే ఎక్కువగా పోలీసులను మోహరించారు. పోలింగ్‌ అంచనాలు కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా వస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు రేవంత్‌రెడ్డి ఇంటికి భారీగా తరలివస్తున్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే సీఎం అభ్యర్థి రేవంత్‌రెడ్డి అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఆయన నివాసానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉందని తెలియడంతో ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం ఆధారంగా భద్రత పెంచినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాంటూ రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు భయపడకుండా కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోరాటంలో విూరంతా ప్రజల పక్షాన నిటారుగా, నికార్సుగా నిలబడ్డారని కొనియాడారు. విూ కష్టం, శ్రమ వృథా కాలేదని తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో విూ అందరి పాత్ర మరువలేనిదని.. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.