అరుణకు న్యాయం చేయాలని ఓయూ విద్యార్ధి సంఘాల నిరసన
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధిని అరుణ హత్యకు నిరసనగా ఓయూ న్యాయ కళాశాల వద్ద విద్యార్ధిసంఘాలు నిరసనకు దిగాయి. న్యాయ కళాశాల నుంచి సచివాలయం వరకు ప్రదర్శనగా బయల్దేరగా ఓయూ ఎన్‌సీసీ గేట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆందోళనకారులను అరెస్టు చేసి నల్లకుంట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. అరుణపై అత్యాచారానికి పాల్పడ్డ శివకుమార్‌ను అరెస్టు చేసి ఉరితీయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు ఓయూ మహిళా వసతి గృహం వద్ద విద్యార్ధినులు దీక్షకు దిగారు. అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క దీక్షకు సంఘీభావం ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై జరుగుతున్న దాడులు, హింసను ఆరికట్టలేని హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నేరస్తులకు కఠినమైన శిక్షలు పడేలా చట్లాను కఠినతరం చేయాలన్నారు.