ఆ టెండర్లను రద్దు చేయండి : మైసూరారెడ్డి

హైదరాబాద్‌, జూలై 24 : పోలవరం టెండర్లను రద్దు చేయాలని వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి డిమాండు చేశారు. మంగళవారంనాడు ఆయన ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టెండర్ల వ్యవహారంలో వెయ్యి కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా అయిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే కాంట్రాక్టర్ల మధ్య సయోధ్య కుదిర్చి రింగ్‌ అయ్యేలా చేసిందని ఆరోపించారు. కాంట్రాక్టర్ల వ్యవహారంలో కూడా ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు రావడం దురదృష్టకరమని అన్నారు. గతంలో టెండర్లు వేసినప్పుడు ఎల్‌-1, ఎల్‌-2లను గుర్తించిన ప్రభుత్వం ఆ తర్వాత టెండర్లలో స్థానాలు మార్చడంలో అర్ధమేమిటని ఆయనప్రశ్నించారు. ఈ టెండర్లలో ప్రభుత్వ జోక్యం లేదని, పారదర్శకకతను నిరూపించుకోవాలంటే ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి వాటికి సంబంధించిన ఫైలును సమావేశం ఎదుట ఉంచాలని ఆయన డిమాండు చేశారు. రాష్ట్రంలో పరిపాలన సజావుగా ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదన్నారు. ఒకపక్క కరువు.. మరోపక్క రైతులకు ఎరువులు, విత్తనాల కరువుతో అల్లాడిపోతుంటే ప్రభుత్వం దిక్కులు చూస్తోందన్నారు. పోలవరం టెండర్లను రద్దు చేసి పారదర్శకతతో కాంట్రాక్టు ఇవ్వాలని ఆయన కోరారు.